
విడాకుల బాటలో మరో హీరోయిన్?
ముంబై: దక్షిణాది హీరోయిన్ మీరా జాస్మిన్ విడాకులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2014 లో అనూహ్యంగా దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను పెళ్లాడిన ఈ అమ్మడు తాజాగా విడాకులకోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మీరా పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే ఏడాది నుంచి విభేదాలతోనే కలిసి సాగుతున్న ఈ జంట.. చివరికి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మలయాళ కుట్టి మళ్లీ కరియర్ పై దృష్టి పెట్టే పనిలో బిజీ ఉందట. ఈ నేపధ్యంలోనే ఇండియాలో స్థిరపడేందుకు యోచిస్తోందట. పెళ్లి తర్వాత దుబాయ్ లో సెటిల్ అయిన మీరా ఇటీవల 'పతూ కల్పనకల్' అనే చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. దర్శకుడిగా డాన్ మాక్స్ డెబ్యూ మూవీ అయిన ఈ చిత్రంలో మీరా పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది. అలాగే మరో డెబ్యూ హీరో కాళిదాస్ జయరామ్ తో పూమారం అనే మలయాళంలో చిత్రంలో నటిస్తోంది.
మరోవైపు ఇటీవల మీడియాతో మాట్లాడిన మీరా జాస్మిన్ తన నిర్ణయాల పట్ల సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించింది. సినీ జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ 100 శాతం సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించింది. తనకు పెద్ద పెద్ద కలలులేవని, ఉన్నదానితో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొంది. 100 సినిమాల్లో నటించాలి లాంటి లక్ష్యాలేవీ తనకు లేవని స్పష్టం చేసింది. ఇంతలోనే విడాకుల వార్తలు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
కరియర్ పీక్ స్టేజ్ లో మాండలిన్ రాజేష్ అనే మ్యుజీషియన్ తో ప్రేమాయణం సాగించినట్టువార్తలు గుప్పుమన్నాయి. చివరికి రెండేళ్ల కిందట వివాదాస్పద రీతిలో అనిల్ ను పెళ్లాడింది. అనిల్ మొదటి భార్య బంధువుల ఆందోళన నేపథ్యంలో పోలిసుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. అయితే వివిధకారణాలతో మీరా- అనిల్ పెళ్లి రిజిస్టర్ కు అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విడాకుల వార్తలపై మీరా దంపతులు ఇంకా స్పందించాల్సి ఉంది.