
నా పెనిమిటి చనిపోయాడంటయ్యా.. ఆస్పత్రికి తీసుకెళ్లరూ..
రాజమండ్రి : ‘నా పెనిమిటి చనిపోయాడంటయ్యా.. ఆస్పత్రిలో ఉంచారట. దారి తెలియదు. మీకు దణ్ణం పెడతా. అక్కడికి తీసుకెళ్లండి బాబూ..’ అంటూ పైలా అప్పలనర్సమ్మ పుష్కరఘాట్‌లో నాలుగ్గంటలపాటు కనిపించిన వారినల్లా వేడుకోవడం భక్తులను కలచివేసింది. ఆమెతో పాటే బృందంలో వచ్చిన జిడ్డు అప్పల నర్సమ్మ కూడా మృత్యువాతపడింది. ఈ ఇద్దరి మృతదేహాల కోసం శ్రీకాకుళం జిల్లా వేజెండ్ల మండలం సరసన్నపల్లె గ్రామం నుంచి వచ్చిన బృందం ఘాట్లో రోదిస్తూ అధికారులను బతిమాలింది. అయినా వారిని పట్టించుకునే వారు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. సరసన్నపాలెం నుంచి 50 మంది ఒక టూరిస్టు బస్సును మాట్లాడుకుని సోమవారం సాయంత్రం పుష్కరాల కోసం రాజమండ్రికి వచ్చారు.
నగర శివారులో బస్సు దిగి నడుచుకుంటూ ఉదయం 4 గంటలకు బృందమంతా కోటగుమ్మం సెంటర్‌లోని పుష్కరఘాట్‌కు వచ్చింది. అప్పటికే భారీగా జనం ఉండడంతో అప్పలనర్సమ్మ ఆమె భర్త పెంటయ్యనాయుడు, జడ్డు అప్పల నర్సమ్మ, మిగిలినవారంతా లైన్లో నిలబడ్డారు. పుష్కర స్నానం త్వరగా చేసి తిరిగి వెళ్లిపోదామనే ఉద్దేశంతో త్వరత్వరగా ముందుకు కదలిగారు. కానీ కొద్దిసేపటికే గేట్లు మూసివేయడంతో గేటు బయటే నిలబడిపోయారు. ఈ సమయంలో బృందమంతా చెల్లాచెదురైపోయింది. 8.20 గంటలకు గేటు తెరవడంతో అందరితోపాటు ఈ బృందంలోని సభ్యులు కూడా లోనికి తోసుకెళ్లారు. ఏం జరిగిందో తెలిసేలోపే అందరూ ఒకరిమీద ఒకరు పడిపోయారు.
గంటపాటు ఊపిరాడక నరక యాతన అనుభవించి పైలా అప్పల నర్సమ్మ, కొంతమంది బయటపడ్డారు. మిగిలినవారు కనపడకపోవడంతో వారి గురించి వెతకడం ప్రారంభించారు. అందరినీ పట్టుకున్నా పెంటయ్యనాయుడు, జిడ్డు అప్పల నర్సమ్మల జాడ తెలుసుకోలేకపోయారు. 12 గంటలకు ఆ పేర్లున్నవారు ఇద్దరు చనిపోయారని, మృతదేహాలు ఆస్పత్రిలో ఉన్నాయని కంట్రోల్ రూమ్‌లో చెప్పారు. దీంతో కన్నీరుమున్నీరవుతూ పైలా అప్పలనర్సమ్మ, మిగిలిన వారు తమను ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులను, అక్కడున్న ఇతర శాఖల వారిని బతిమాలినా ఎవరూ పట్టించుకోలేదు.
చివరికి మీడియా ప్రతినిధులు వారిని పోలీసులకు అప్పగించినా వారు రెండుగంటలపాటు అటూఇటూ తిప్పి ఘాట్ బయట వదిలేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఒక అంబులెన్స్ ఆస్పత్రికి వెళుతుంటే మీడియా ప్రతినిధులే డ్రైవర్‌ను బతిమాలి సరసన్నపాలెం బృందాన్ని ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రిలో తమవారి మృతదేహాలను చూసి వారంతా గొల్లుమన్నారు. పుణ్యానికి వ స్తే తమవారి ప్రాణాలుపోయాయని బోరున విలపించారు.