
చేష్టలుడిగి... చేతులెత్తేశారు!
తాగునీటి సౌకర్యం కూడా లేదు
ట్రాఫిక్ నిర్వహణ అధ్వానం
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ భక్తజనం
రాజమండ్రి: ‘వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం.. పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నాం. భక్తుల సేవలకే తొలి ప్రాధాన్యం.. వారి రక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నాం’ గడిచిన రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టిన ప్రచారమిది. ఇంతా చేస్తే పుష్కర ఆరంభం రోజే ప్రభుత్వం.. అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. కళ్లముందు విషాద ఘటన జరిగితే ఏం జరిగిందో కూడా తెలియని.. ఎలా స్పందించాలో కూడా అర్థంకాని, చేతకాని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పుష్కరఘాట్ ప్రమాద నివారణలోనే కాదు.. భక్తులు ఘాట్‌ల వద్దకు చేరుకునే ఏర్పాట్లు చేయడంలో, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యల్లో, భక్తులకు తాగునీరు, వైద్యసేవలు, మరుగుదొడ్ల నిర్వహణ... ఇలా ప్రతీ విషయంలోనూ ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.
ప్రణాళికా రాహిత్యం, శ్రద్ధ శూన్యం....: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం నాలుగు నెలులుగా సన్నాహాలు చేస్తోంది. పుష్కర నిర్వహణకు రూ.వందల కోట్లు కేటాయించింది. అయితే పనులు ఆలస్యంగా ఆరంభించడం, సకాలంలో పూర్తి చేయకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం పుష్కరాలను ఆది నుంచి వివాదాస్పదం చేసింది. భక్తుల భద్రతా చర్యల విషయంలోనూ పూర్తిగా విఫలమైంది. రాజమండ్రి నగరంపై దృష్టి పెట్టినా.. ఇక్కడే ఆశించిన స్థాయిలో పనులు పూర్తి చేయలేదు. పుష్కరాలు ఆరంభమైన మంగళవారమూ రోడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం, పార్కింగ్ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం గమనార్హం. చివరకు తాగునీరు అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది.దీనితో భక్తులు దాహంతో అలమటించి పోయారు. గుక్కెడు నీటి కోసం పాన్‌షాపుల వద్ద మంచినీటి వాటర్ బాటిళ్ల వద్ద క్యూకట్టారు. పుష్కర స్నానం కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి రావడం, దీనికితోడు సూర్యభగవానుడి ప్రతాపం తోడుకావడంతో భక్తులు చుక్కనీటి కోసం ఆర్రులు చాచారు.
మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానం...: రాజమండ్రి నగరంలో పుష్కర యాత్రికుల కోసం 1,155 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వీటిని చివరి రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటికి అవసరమైన నీరు సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇవి అధ్వానంగా మారి భక్తులు వినియోగించేందుకు పనికిరాకుండా పోయాయి. చాలామంది పుష్కర భక్తులు పుష్కరఘాట్, కోటిలింగాల ఘాట్‌కు వెళ్లే వీధుల్లో బహిరంగ మల విసర్జన చేస్తున్నారు.