మావోయిస్టు నేత చంద్రమౌళికి జీవిత ఖైదు | Maoist leader Chandramouli to life imprisonment | Sakshi
Sakshi News home page

మావోయిస్టు నేత చంద్రమౌళికి జీవిత ఖైదు

Published Sun, Aug 16 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

మావోయిస్టు నేత చంద్రమౌళికి జీవిత ఖైదు

మావోయిస్టు నేత చంద్రమౌళికి జీవిత ఖైదు

భీమదేవరపల్లి: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్‌లాల్‌కు జీవితకాల శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని బాల్‌గఢ్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లోని అప్పటి రావాణా శాఖ మంత్రిని మావోయిస్టులు హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ చంద్రమౌళికి ఈ శిక్ష ఖరారు చేసింది. 2005లో అరెస్టు అయిన చంద్రమౌళి మూడు రాష్ట్రాల జైళ్లలో శిక్షను అనుభవిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన ఉగ్గె కనకయ్య-సూరమ్మల పెద్ద కొడుకైన ఉగ్గె చంద్రమౌళి పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే పీపుల్స్‌వార్ ఉద్యమానికి ఆకర్షితుడై సానుభూతిపరుడిగా మారాడు. అప్పట్లో చెంజర్లకు చెందిన శంకరమ్మతో అతనికి వివాహం జరిగింది. వారికి కుమారుడు భాస్కర్ జన్మించాడు. 1980లో మాణిక్యాపూర్‌లో ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ నాయకుడు శనిగరం వెంకటేశ్వర్లు ఆలియాస్ సాహు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ దళపతి గణపతి అలియూస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావుతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రమౌళి విప్లవోద్యమానికి అంకితమై 1981లో అజ్ఞాతంలోకి వెళ్లారు.

దళ సభ్యుడిగా ఉంటూ అనతి కాలంలోనే హుస్నాబాద్, హుజూరాబాద్ సీవో (సెంట్రల్ ఆర్గనైజర్)గా బాధ్యతలు స్వీకరించారు. 1988లో ఆయన అరెస్టయ్యూరు. బెయిల్‌పై విడుదల కాగానే తిరిగి ఉద్యమంలోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో పనిచేశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా నియామకమైన కొద్ది రోజులకే 2005 ఆగస్టు 6న మహారాష్ట్రలోని నాగపూర్‌లో అరెస్టయ్యూరు. పార్టీ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు నాగపూర్‌లోని ఓ లాడ్జీలో ఉన్న అతనిని అక్కడి పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. అప్పటికి చంద్రమౌళి  కేంద్ర కమిటీ సభ్యుడనే విషయం అక్కడి పోలీసులకు తెలియదు. చంద్రమౌళిపై మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఏపీ రాష్ట్రాల్లో మొత్తం 35 కేసులు నమోదు చేశారు. 

ఇంతకాలం మధ్యప్రదేశ్‌లోని బాల్‌ఘడ్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్, మహారాష్ట్రలోని బిలాస్‌పూర్ జైలులో ఉన్నారు. మధ్యప్రదేశ్ రావాణా శాఖ మంత్రి హత్య సంఘటనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులో చంద్రమౌళి ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ నెల 14న మధ్యప్రదేశ్‌లోని బాల్‌ఘడ్ కోర్టు అక్కడి రవాణా శాఖ మంత్రి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ చంద్రమౌళికి జీవితకాల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ‘నా కొడుకు ఇంతకాలం జైల్లో ఉన్నాడు. ఇక విడుదల అయితడని ఎదురు సూత్తన్న’ అని చంద్రమౌళి తల్లి సూరమ్మ కన్నీటి పర్యంతమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement