
మార్కెట్లోకి సెలెరియో డీజిల్
ధర రూ. 4.65 - 5.71 లక్షలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ సెలెరియో మోడల్‌లో డీజిల్ వేరియంట్‌ను బుదవారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.4.65 లక్షల నుంచి రూ.5.71 లక్షల శ్రేణిలో ఉంటాయని మారుతీ సుజుకి ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. మారుతీ సుజుకి కంపెనీ మాతృసంస్థ సుజుకి రూపొందించిన తొలి డీజిల్ ఇంజిన్, 793సీసీ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించామని పేర్కొన్నారు. ఈ డీజిల్ సెలెరియో 27.62 కి.మీ. మైలేజీనిస్తుందని ఆయన వివరించారు.
డీజిల్ కార్లకు డిమాండ్
సెలెరియో మోడల్‌లో పెట్రోల్ (ధరలు రూ.3.90 లక్షల నుంచి రూ.5 లక్షల రేంజ్‌లో), సీఎన్‌జీ (ధర రూ.4.85 లక్షలు) రకాలను కూడా మారుతీ సుజుకీ ఆఫర్ చేస్తోంది. 2014లో మార్కెట్లోకి తెచ్చిన ఈ కారు ఇప్పటిదాకా 95 వేల యూనిట్లు అమ్ముడుపోయింది. దిగువ స్థాయి హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లో డీజిల్ కార్లకు డిమాండ్ ఉందని తమ కంపెనీ అధ్యయనంలో తేలిందని, అందుకే ఈ డీజిల్ కారును మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. మారుతీ లాంటి కంపెనీలు డీజిల్ కార్లు తయారు చేస్తే కొనడానికి 86 శాతం మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2020 కల్లా ఏడాదికి 20 లక్షల మారుతీ కార్లు విక్రయించడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యసాధన కోసం అధునాతన టెక్నాలజీలతో కూడిన మరిన్ని కొత్త కార్లను అందించనున్నామని తెలియజేశారు.