
ఎంఐఎం ఎదుగుదల ప్రమాదకరం: శివసేన
ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకోవడం ప్రమాదకర పరిణామమని శివసేన పేర్కొంది.
ముంబై: ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకోవడం ప్రమాదకర పరిణామమని శివసేన పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీకి దళితులు ఇకముందు కూడా మద్దతు పలికితే మహారాష్ట్రలో సామాజిక ఐక్యతకు విఘాతం కలుగుతుందని సేన ఆందోళన వ్యక్తంచేసింది. శుక్రవారం శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఈ అంశంపై పలు వ్యాఖ్యలు చేసింది.
ఎంఐఎం ఫలితాలపై హిందువులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి వరుసగా ఆరోసారి గెలిచింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 25 సీట్లు లభించగా, కాంగ్రెస్ కేవలం పది స్థానాల్లో మాత్రమే గెలవడం గమనార్హం. ఇక ఎన్సీపీకి మూడు సీట్లే వచ్చాయి. ఫలితాల్లో మొత్తం 113 స్థానాలకుగాను సేన, బీజేపీ కూటమి 51 సీట్లు గెలుచుకుంది.