
అన్నీఉన్నా అల్లుడు లేడు...!
పెళ్లి చేసుకోవడానికి తగిన అమ్మాయి దొరకడం లేదని బాధపడుతున్న యువకులకు బంపర్ ఆఫర్. పెళ్లి చేసుకుంటే పిల్లతో పాటు వందల కోట్లు పొందే సువర్ణ అవకాశం. ఆ ఆమ్మాయిని పెళ్లాడితే ఏకంగా 830 కోట్ల రూపాయిలు కానుకగా ఇస్తారు. హాంకాంగ్‌కు చెందిన ఓ బిలీయనీర్ ఈ ఆఫర్ ఇస్తున్నారు.
హాంకాంగ్‌కు చెందిన ఈ అపరకుబేరుడి పేరు సెసిల్ చావో జెట్సుంగ్. పాపం..తన కూతురు(జిగీచావో) పెళ్లి కోసం నానా కష్టాలు పడుతున్నాడు. దేశంలోనే అత్యంత ధనవంతుడైనా కూడా అల్లుడిని మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. అందుకే తన కూతురును పెళ్లి చేసుకుంటే రూ.830 కోట్లు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
గతంలో కూడా రూ.400 కోట్లు ఆఫర్ చేసినా..ఒక్కరు కూడా పెళ్లికి ముందుకు రాలేదు. అందుకే ఈ సారి కట్నం రెట్టింపు చేశాడు. కాగా సెసిల్ కూతురు గతంలోనే ఒకరి జీవితంలో ప్రవేశించింది. అయితే.. ఆమె జీవితం పంచుకున్నది అబ్బాయితో కాదు అమ్మాయితో. సింపుల్‌గా చెప్పాలంటే సెసిల్ కూతురు స్వలింగ సంపర్కురాలు. గత తొమ్మిదేళ్లుగా ఆమె మరో అమ్మాయితో కలసి సహజీవనం సాగిస్తోంది. సెసిల్ కూతురు లెస్బియన్ కావడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదీ అసలు స్టోరీ.
కుమార్తె పెళ్లి చేసుకొని పిల్లలను కనాలన్నది సెసిల్ కోరిక. అయితే.. సెసిల్ కూతురి ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. భారీ ఆఫర్ చూపి వరుడ్ని ఆకర్షించలేమని చెబుతోంది. సెసిల్ మాత్రం కూతురి మనసు మారుతుందని విశ్వాసంతో ఉన్నారు. చూద్దాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో.