న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రాంతంలో మరిన్ని విపత్తులు సంభవించేందుకు ఆస్కారముందని ఐఏఎఫ్ అధికారి ఒకరు హెచ్చరించారు. గత జూన్‌లో ఉత్తరాఖండ్‌లో భీకరమైన రీతిలో వరదలు సంభవించి భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిన సందర్భంగా.. గాలింపు, సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో కీలకపాత్ర పోషించిన ఎయిర్ వైస్ మార్షల్ ఎస్‌ఆర్‌కే నాయర్ సోమవారమిక్కడ ఒక సెమినార్‌లో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. ‘‘విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా కేదార్‌నాథ్ ఎగువన ఉన్న భారీ హిమానీనద సరస్సు కరిగిపోయి నీరంతా ఒక్క ఉదుటన దిగువకు ప్రవహించి తీవ్రమైన బీభత్సం సృష్టించింది. ఇటువంటి హిమానీనద సరస్సులు ఈ ప్రాంతంలో మరిన్ని ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు సంభవించేందుకు ఆస్కారం ఉంది’’ అని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలో ఎటువంటి విపత్తు సంభవించినా తగిన విధంగా ఎదుర్కొనేందుకు, సత్వర సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగా కీలకమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ల కోసం ఇంధనంతో సహా సహాయ సామగ్రిని సైతం తగిన మొత్తంలో నిల్వ చేసి ఉంచాల్సిన అవసరం ఎంతయినా ఉందని నాయర్ సూచించారు.