అమల్లోకి నేపాల్ రాజ్యాంగం | More than half a century in the making: Nepal enshrines new constitution | Sakshi
Sakshi News home page

అమల్లోకి నేపాల్ రాజ్యాంగం

Published Mon, Sep 21 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

అమల్లోకి నేపాల్ రాజ్యాంగం

అమల్లోకి నేపాల్ రాజ్యాంగం

కఠ్మాండు: ఏడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత సాకారమైన చరిత్రాత్మక రాజ్యాంగాన్ని నేపాల్ ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హిమాలయ దేశం హిందూ రాచరిక రాజ్యం నుంచి పూర్తి లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశాన్ని ఏడు సమాఖ్య రాష్ట్రాలుగా విభజిస్తూ రాజ్యాంగంలో చేసిన ప్రకటనపై మదేశీ తెగ ప్రజల నిరసన మధ్య రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ‘రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిన, రాజ్యాంగ సభ చైర్మన్ ధ్రువీకరించిన రాజ్యాంగం ఈ రోజు నుంచి..

అంటే 2015 సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటిస్తున్నాను’ అని దేశాధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్ ఆదివారం పార్లమెంటులో రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తూ ప్రకటించారు. ‘ప్రజాస్వామ్యం, శాంతి కోసం ప్రజలు ఏడు దశాబ్దాలు పోరాడారు. కొత్త రాజ్యాంగం రావడంతో తాత్కాలిక రాజ్యాంగం రద్దయింది. దేశ శాంతి, సుస్థితర, ఆర్థిక ప్రగతికి కొత్త రాజ్యాంగం బాటలు వేస్తుంది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, అందరి హక్కులకు అవకాశమిచ్చింది. అందరూ ఏకతాటిపైకొచ్చి, సహకరించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

రాజ్యాంగ అమలు ప్రకటనకుగాను అధ్యక్షుడికి కృతజ్ఞలు తెలుపుతూ అసెంబ్లీ చివరి సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కొత్త రాజ్యాంగం ప్రకారం రెండు చట్టసభలు ఉంటాయి. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో 375 మంది సభ్యులు, ఎగువ సభలో 60 మంది సభ్యులు ఉంటారు. కొత్త రాజ్యాంగం రావడంతో నేపాలీలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు ఎగరేసి, బాణసంచా కాల్చారు. మరోపక్క.. మదేశీ తెగ ప్రజలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

భారత్ సరిహద్దులోని దక్షిణ ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు, ఆస్తుల విధ్వంసం జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిరాట్‌నగర్, బీర్‌గంజ్, ధరాన్‌లలో రాజ్యాంగ అనుకూల, వ్యతిరేక వర్గాలు ర్యాలీలు నిర్వహించాయి. బీర్‌గంజ్‌లో సీపీఎన్-యూఎంఎల్ ఎంపీ ఇంటిని ధ్వంసం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిరసనకారుడు చనిపోయాడు. రాజ్యాంగంలో తమ డిమాండ్లను నెరవేర్చలేదని మదేసీ, థారు తెగలు ఆరోపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement