సినీ సంగీతంలో విశ్వ'నాదం'
ఆయన స్వర పరిచిన పాటల కోసం సంగీతాభిమానులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. శ్రోతల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన సరిగమలు పలికిస్తారు. ఆయన పాటలు విని సంగీతాభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏ చిత్రానికి ఆయన సంగీతం అందించినా శ్రోతలు సంగీత సాగరంలో ఒలలాడాల్సిందే. ఆయనే సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్ ఎం ఎస్ విశ్వనాథన్ (87).
చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎం ఎస్ విశ్వనాథన్ మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా శ్వాస కోస వ్యాధితో బాధపడుతున్న ఎం ఎస్ను కుటుంబసభ్యులు ఇటీవలే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన ఆరోగ్యం గత మంగళవారం కుదుటపడింది. దాంతో ఎం ఎస్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఎంఎస్ను ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన్ని ఐసీయూకి తరలించారు. ఆ క్రమంలో చికిత్స పొందుతూ ఎంఎస్ మరణించారు.
తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన దాదాపు 750 చిత్రాలకు పైగా ఆయన సంగీత దర్శకత్వం వహించారు.1952లో శివాజీ గణేషన్ హీరోగా నటించిన పానమ్ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత ఎం ఎస్ విశ్వనాథన్ ప్రాణ స్నేహితుడు టీకే రామ్మూర్తితో కలసి 'విశ్వనాథన్ - రామ్మూర్తి' పేరిట ఎన్నో హిట్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత 1965లో విశ్వనాథన్, రామ్మూర్తి ద్వయం విడిపోయింది. అనంతరం ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి.
తెలుగులో నిర్మించిన తెనాలి రామకృష్ణ, అంతులేని కథ, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం తదితర చిత్రాలకు ఎం ఎస్ స్వర రచన చేశారు. ఎంఎస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ తెలుగు ప్రజలను ఆనందపరవశుల్ని చేశాయి. ఎం ఎస్ విశ్వనాథన్, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ కాంబినేషన్లో వచ్చిన అన్ని చిత్రాల్లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే.
ఎం ఎస్ విశ్వనాథన్ భార్య జానకీ 2012లో మరణించారు. ఆ తర్వాత ఆయన మిత్రుడు టీ కే. రామ్మూర్తి మృతి చెందారు. ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించి తనను తాను గౌరవించుకుంది. అలాగే లెక్కకు మిక్కిలి పురస్కారాలు ఎం ఎస్ విశ్వనాథన్ను వరించాయి. 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోని ఇలప్పుళిలో ఎంఎస్ విశ్వనాథన్ జన్మించారు.