వెక్కివెక్కి ఏడ్చిన యోగి.. ఎందుకు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం చాలాకష్టం. ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేస్తుండగా ఈ ఘట్టాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు పదేళ్ల కిందట జరిగిన ఘటన గుర్తొచ్చి ఉండాలి. అప్పుడు అధికారంలో ఉన్న ములాయం ప్రభుత్వం 11 రోజులపాటు యోగిని జైల్లో పెట్టింది. దీంతో బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన సాక్షాత్తు పార్లమెంటులోనే వెక్కివెక్కి ఏడ్చారు.
గోరఖ్‌పూర్‌లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణలపై యోగిని పోలీసులు జైల్లో పెట్టారు. తనకు ఎదురైన ఈ చేదుఅనుభవాన్ని వివరిస్తూ లోక్‌సభలో యోగి భోరుమన్నారు. అప్పటి స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అనుమతి ఇవ్వడంతో సభలో మాట్లాడిన యోగి.. రాజకీయ కుట్ర కారణంగానే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. తనకు ’న్యాయం’ కావాలని, ఒకవేళ న్యాయం జరగకపోతే ఎంపీ పదవి నుంచి తప్పుకుంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. తాను సన్యాసినని, తనకు రాజకీయాలు వృత్తి కాదని చెప్పారు. ఆయన భావజాలంతో వ్యతిరేకించినా.. ఆయనకు ఎదురైన చేదు అనుభవంపై సీపీఐ గురుదాస్ దాస్‌గుప్తా, సీపీఎం వర్కల రాధాకృష్ణన్, జేడీయూ ప్రభూనాథ్ సింగ్ తదితర సభ్యులు గళమెత్తారు. యోగి భావోద్వేగంతో మాట్లాడుతూ.. ములాయం ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. ఎస్పీ సభ్యులు ప్రసంగాన్ని అడ్డుకోలేదు.
అప్పట్లో గోరఖ్‌పూర్‌లో మొహార్రం సందర్భంగా ఒక వ్యక్తి చనిపోయాడు. అతనికి సంతాపం తెలిపేందుకు వచ్చిన ఎంపీ యోగిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వల్ల మతఘర్షణలు మరింత పెరిగిపోవచ్చునని భావనతో అరెస్టు చేసి 11రోజులు జైల్లో పెట్టారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన యోగి నాడు ములాయం ప్రభుత్వంపై మండిపడ్డారు. నేడు అదే యోగి దేశంలో కీలకమైన యూపీ ప్రభుత్వాధినేతగా పగ్గాలు చేపడుతుండగా ములాయం మౌనసాక్షి అయ్యారు.