అమెరికా ఎయిర్ లైన్స్ పై మహిళ ఫిర్యాదు
మాంట్ గొమెరీ: తనను అకారణంగా సస్పెండ్ చేశారని అమెరికాలోని ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ వేస్ పై ఓ ముస్లిం మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. ప్రయాణికులకు మద్యం అందించలేదన్న సాకుతో తనను ఏడాది పాటు ఉద్యోగం నుంచి తొలంగించారని ఆరోపించింది. డెట్రాయిట్ కు చెందిన షారీ స్టాన్లీ(40) ఈమేరకు సమాన ఉపాధి అవకాశాల సంఘానికి ఫిర్యాదు చేసింది. తన మత విశ్వాసాలను గౌరవించకుండా వివక్ష చూపారని పేర్కొంది.
సహఉద్యోగి ఫిర్యాదు మేరకు స్టాన్లీపై చర్య తీసుకున్నారని మిచిగాన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ ప్రతినిధి లినా మార్సీ వెల్లడించారు. ఉద్యోగంలో చేరే నాటిని స్టాన్లీ- ఇస్లాంలోకి మారిందని చెప్పారు. మద్యం అందించలేదన్న కారణంతో బలవంతంగా ఏడాది పాటు జీతంలేని సెలవు ఇచ్చారని తెలిపారు. మూడేళ్లుగా ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేస్తున్న ఆమెను వివక్షకు గురిచేశారని ఆరోపించారు.
అయితే తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరి విశ్వాసాలను తాము గౌరవిస్తామని ఎక్స్ ప్రెస్ జెట్ ప్రకటించింది. అట్లాంటా కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ వేస్ కు 388 విమానాలు ఉన్నాయి. 9 వేల మంది పనిచేస్తున్నారు.