'నా భార్య వంటగదికి చెందింది' | my wife belongs To kitchen, says Nigerian President Muhammadu Buhari | Sakshi
Sakshi News home page

'నా భార్య వంటగదికి చెందింది'

Published Sat, Oct 15 2016 10:47 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

'నా భార్య వంటగదికి చెందింది'

'నా భార్య వంటగదికి చెందింది'

అబూజ: తెలుగు టీవీ చానల్స్ లో భార్యాభర్తల పంచాయితీలు చూస్తున్నారుకదా.. ఆ రేంజ్ లో తిట్టుకోనప్పటికీ ప్రఖ్యాత బీబీసీ చానెల్ లోనూ  అలాంటి ఓ భార్యాభర్తల పంచాయితీ ప్రసారం అయింది. అతను ఆఫ్రికాలోనే పెద్ద దేశం నైజీరియాకు అధ్యక్షుడు. ఆమె.. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తిచేసింది. 'దేశపాలనలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది' అనడం 'కంటే అన్నీ తానై ఆయనను నడిపిస్తోంది' అనడం ఉత్తమం. అలాంటావిడను పట్టుకుని 'ఈమె వంట గదికి చెందింది'అని అధక్షుడు వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలింతకీ ఏం జరిగిందంటే..

శుక్రవారం ప్రసారమైన ఓ కార్యక్రమంలో నైజీరియా అధ్యక్షుడు మొహమ్మదు బుహారీ భార్య అయిషా బుహారీ నిజాలు మాట్లాడారు. 'నా భర్తకు స్వయంగా ఆయనే నియమించిన ఉన్నతాధికారులు ఎవరో కూడా గుర్తుండదు. అన్ని విషయాలు నేనే దగ్గరుండి చూసుకోవాలి. చాలా ఏళ్లుగా ఆ పని చేసి, చేసి అలసిపోయా. అందుకే 2019 ఎన్నికల్లో పోటీకి దిగొద్దని ఆయనకు అల్టిమేటం ఇచ్చా. నా మాట కాదని ఎన్నికల్లో పోటీ చేస్తే గనుక.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేపడతా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనను ఓడించి తీరుతా' అని అయిషా అన్నారు.

సంచలనం రేపిన అయిషా వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన మొహమ్మదు.. 'నా భార్య ఏ పార్టీకి చెందిందో చెప్పలేను. అయితే ఆమె నా వంటగదికి, ఇంకొన్ని కీలకమైన గదులకు చెందిందని మాత్రం చెప్పగలను' అని అన్నారు. నైజీరియాకు అతిథిగా వచ్చిన జర్మన్ చాన్సరల్ ఏంజిలా మోర్కెల్ పక్కనుండగానే ఆయనిలా మాట్లాడారు. అతిథిమర్యాద పాటిస్తూ ఏంజిలా చిన్నగా నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం కష్టమేనని మొహమ్మదు తేల్చిచెప్పారు. దీంతో పంచాయితీ అపరిష్కృతంగా మిగిలిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement