ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
Published Tue, Sep 3 2013 3:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ(56) ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని రాజ్‌నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు జస్టిస్ రమణ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కోర్టుకే ఆయన కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన జస్టిస్ రమణ రాజ్యాంగ, క్రిమినల్, రాష్ట్రాల మధ్య నదీ చట్టాలు తదితరాల్లో స్పెషలైజేషన్ సాధించారు.
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి అధ్యక్షునిగా వ్యవహరించారు. అడ్వొకేట్‌గా 1983లో ఎన్‌రోల్ చేయించుకున్న జస్టిస్ రమణ ఏపీ హైకోర్టు, కేంద్ర, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్‌లో సేవలందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌తో పాటు పలువురు మంత్రులు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత జస్టిస్ రమణ మాట్లాడుతూ న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, ఢిల్లీ హైకోర్టుకు సీజేగా ఉన్న జస్టిస్ డి. మురుగేశన్ గత జూన్‌లో రిటైర్ కావడంతో అప్పటి నుంచి జస్టిస్ బదర్ దుర్రేజ్ అహ్మద్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
ఘన వీడ్కోలు: పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు సీజేగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా నేతృత్వంలో వీడ్కోలు కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. న్యాయవ్యవస్థకు జస్టిస్ రమణ అందించిన సేవలను అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ, దివంగత సీఎం ఎన్టీ రామారావుకు న్యాయ సలహాదారునిగా పనిచేయడం తన అదృష్టమన్నారు. జస్టిస్ రోహిణి తనకు దేవుడిచ్చిన సోదరి అని తెలిపారు. కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్లు, అదనపు ఏజీలు పాల్గొన్నారు.
Advertisement