విపక్షంపై దాష్టీకం
నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త అరెస్ట్
పుత్తూరు: అధికారపక్షం అండతో చిత్తూరు జిల్లా నగరిలో పోలీసులు రెచ్చిపోయారు. మూడు నెలలక్రితం నమోదైన కేసుకు సంబంధించి నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతి భర్త, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్‌ను ఆదివారం ఉదయం ఆయన స్వగృహంలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటివద్ద హంగామా సృష్టించారు. కుమార్ పట్ల, ఆయన కుటుంబం పట్ల దాష్టీకం ప్రదర్శించారు. ఆయన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.
అడ్డువచ్చిన ఆయన సతీమణి, మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా నెట్టేశారు. ఈ సందర్భంగా ఆమె దుస్తులు చిరిగిపోయాయి. కుమార్ కుటుంబసభ్యుల పట్లా దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనతో నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో మధ్యాహ్నం నేరుగా జడ్జి వద్ద కుమార్‌ను పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఈ నెల 27 వరకు రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం పోలీసులు కేజే కుమార్‌ను చిత్తూరు జైలుకు తరలించారు.
మూడునెలలక్రితం నాటి కేసులో ...
నగరి మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి శ్రీకాంత్ మూడు నెలలక్రితం చేసిన ఫిర్యాదు మేరకు కేజే కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ స్వయంగా విచారణ జరిపారు. అయితే ఆ విచారణలో ఏమీ లభించకపోవడంతో గమ్మున ఉండిపోయారు. అయితే మూడు నెలల తరువాత ఇప్పుడు ఉన్నట్టుండీ అదే కేసులో పోలీసులు హడావుడి చేశారు.
ఆయన్ను అరెస్ట్ చేయడానికి శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసు అధికారులు ప్రయత్నించారు. ఆయన స్వగృహం వద్ద భారీగా పోలీసు బలగాల్ని దింపారు. తాను వస్తున్నానని చెప్పినా పట్టించుకోని పోలీసు అధికారులు, సిబ్బంది కేజే కుమార్‌ను బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతి.. ఎందుకు బలవంతంగా తీసుకెళుతున్నారంటూ ప్రశ్నిస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెను మహిళ అని కూడా చూడకుండా పోలీసులు పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి.
దీనిపై ఆమె మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనను కనీసం మహిళ అని కూడా చూడకుండా పోలీసులు పక్కకు నెట్టడం బాధాకరమంటూ కంటతడి పెట్టారు. కాగా నగరిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిం దని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు. కేజే కుమార్ కుటుంబ సభ్యులు హత్యలేమైనా చేశారా? అర్ధరాత్రి పోలీసు బలగాలు మోహరించడమేమిటి? అంటూ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కులాల చిచ్చు రాజేస్తుండటాన్ని తాను ఖండిస్తున్నానన్నారు.
పార్టీ మీకు అండగా ఉంటుంది
* కేజే కుటుంబానికి జగన్ భరోసా
నగరి: నగరి మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత కేజే కుమార్ అరెస్ట్ ఘటనలో పోలీసుల తీరును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండిం చా రు. ఆదివారం కేజే కుమార్ అరెస్ట్ సమాచారాన్ని తెలుసుకున్న వైఎస్ జగన్.. ఫోన్‌లో కుమార్ సతీమణి, మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతితో మాట్లాడి పరామర్శించారు.
సంఘటనకు దారితీసిన పరిస్థితులు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి భయందోళనకు గురికావద్దని, ధైర్యంగా ఉండాలని, పార్టీ మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్ష వల్ల ఈ సంఘటన జరి గిందని తనకు సమాచారం అందినట్టు ఆయన చెప్పారు. ఎటువంటి ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు.