shanta kumari
-
బోధన వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు శుభవార్త. వారికి ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభిస్తాయి. దీనికి సంబంధించి సవరణ ఉత్తర్వులను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం జారీ చేశారు. వాస్తవంగా గతేడాదే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా.. సాంకేతిక కారణాల వల్ల అది అమలుకాలేదు. ఆ తర్వాత వరుసగా ఎన్నికలు రావడంతో ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు సవరణకు నోచుకోలేదు. సవరణలు కోరుతూ వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం (సీఏఎస్) కింద దీన్ని అమలు చేస్తారు. 2006 నవంబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అప్పటినుంచి సర్వీసును మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని, అయితే ఆర్థికపరంగా ఎలాంటి ప్రయోజనం కల్పించబోమని స్పష్టం చేశారు. కేవలం గతేడాది ఉత్తర్వులు విడుదలైన తేదీ అంటే సెప్టెంబర్ 5 నుంచి మాత్రమే ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుతాయి. 2006 నుంచి అమలు చేయడమంటే అప్పటినుంచి సర్వీసులో ఉన్న బోధనా వైద్యులకు పదోన్నతులు మాత్రం అమల్లోకి వస్తాయన్నమాట. తాజా నిర్ణయం ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక వారికి స్కేల్లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. పదోన్నతుల కోసం ఎదురుచూపు.. ప్రస్తుతం పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైర్ అయ్యాకే పదోన్నతులు లభిస్తున్నాయి. దీనివల్ల ఖాళీలు కొన్నే ఉంటే కొందరికి అవకాశమున్నా మరికొందరికి పదోన్నతులు లభించవు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చినవారు కూడా ఉన్నారు. మరికొందరికైతే 20 ఏళ్లకు గాని పదోన్నతి వచ్చిన పరిస్థితి లేదు. ఇది వైద్యుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలుచేస్తున్నాయి. తాజా నిర్ణయంతో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలుగనుందని సమాచారం. అంతేకాదు వారికి పదోన్నతి వచ్చిన ప్రతీసారి కూడా స్కేల్స్‌లోనూ మార్పులుంటాయి. అంటే ఆర్థికంగా వారికి మరింత ప్రయోజనం కలగనుంది. 65 ఏళ్ల విరమణపై ఆర్డినెన్స్‌కు కసరత్తు.. బోధనా వైద్యులకు విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు నిర్ణయం అమలుకు సంబంధించి శరవేగంగా ఆర్డినెన్స్ జారీచేసే పని జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఆర్డినెన్స్ వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. కొందరైతే దీనికి సంబంధించి గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ఫైలు వెళ్లిందని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు పొక్కడంలేదు. విరమణ వయసు పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే జూడాలు, కొందరు డాక్టర్లు, ప్రభుత్వ వైద్యుల సంఘాల్లో కొన్ని ఇప్పటికే నిరసనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు ఆర్డినెన్స్ తెస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. మార్పు హోదాలోనే.. పనిలో కాదు ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా మధ్యమధ్యలో స్కేల్స్‌లోనూ నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీత కాలంలో పదోన్నతులు ఇవ్వడం వల్ల ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు భౌతికంగా ఇతర పోస్టులకు మారతారు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. -
విపక్షంపై దాష్టీకం
నగరి మున్సిపల్ చైర్పర్సన్ భర్త అరెస్ట్ పుత్తూరు: అధికారపక్షం అండతో చిత్తూరు జిల్లా నగరిలో పోలీసులు రెచ్చిపోయారు. మూడు నెలలక్రితం నమోదైన కేసుకు సంబంధించి నగరి మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి భర్త, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్‌ను ఆదివారం ఉదయం ఆయన స్వగృహంలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటివద్ద హంగామా సృష్టించారు. కుమార్ పట్ల, ఆయన కుటుంబం పట్ల దాష్టీకం ప్రదర్శించారు. ఆయన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అడ్డువచ్చిన ఆయన సతీమణి, మున్సిపల్ చైర్పర్సన్ శాంతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా నెట్టేశారు. ఈ సందర్భంగా ఆమె దుస్తులు చిరిగిపోయాయి. కుమార్ కుటుంబసభ్యుల పట్లా దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనతో నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో మధ్యాహ్నం నేరుగా జడ్జి వద్ద కుమార్‌ను పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఈ నెల 27 వరకు రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం పోలీసులు కేజే కుమార్‌ను చిత్తూరు జైలుకు తరలించారు. మూడునెలలక్రితం నాటి కేసులో ... నగరి మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి శ్రీకాంత్ మూడు నెలలక్రితం చేసిన ఫిర్యాదు మేరకు కేజే కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ స్వయంగా విచారణ జరిపారు. అయితే ఆ విచారణలో ఏమీ లభించకపోవడంతో గమ్మున ఉండిపోయారు. అయితే మూడు నెలల తరువాత ఇప్పుడు ఉన్నట్టుండీ అదే కేసులో పోలీసులు హడావుడి చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసు అధికారులు ప్రయత్నించారు. ఆయన స్వగృహం వద్ద భారీగా పోలీసు బలగాల్ని దింపారు. తాను వస్తున్నానని చెప్పినా పట్టించుకోని పోలీసు అధికారులు, సిబ్బంది కేజే కుమార్‌ను బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి.. ఎందుకు బలవంతంగా తీసుకెళుతున్నారంటూ ప్రశ్నిస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెను మహిళ అని కూడా చూడకుండా పోలీసులు పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనను కనీసం మహిళ అని కూడా చూడకుండా పోలీసులు పక్కకు నెట్టడం బాధాకరమంటూ కంటతడి పెట్టారు. కాగా నగరిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిం దని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు. కేజే కుమార్ కుటుంబ సభ్యులు హత్యలేమైనా చేశారా? అర్ధరాత్రి పోలీసు బలగాలు మోహరించడమేమిటి? అంటూ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కులాల చిచ్చు రాజేస్తుండటాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. పార్టీ మీకు అండగా ఉంటుంది * కేజే కుటుంబానికి జగన్ భరోసా నగరి: నగరి మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత కేజే కుమార్ అరెస్ట్ ఘటనలో పోలీసుల తీరును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండిం చా రు. ఆదివారం కేజే కుమార్ అరెస్ట్ సమాచారాన్ని తెలుసుకున్న వైఎస్ జగన్.. ఫోన్లో కుమార్ సతీమణి, మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతితో మాట్లాడి పరామర్శించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి భయందోళనకు గురికావద్దని, ధైర్యంగా ఉండాలని, పార్టీ మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్ష వల్ల ఈ సంఘటన జరి గిందని తనకు సమాచారం అందినట్టు ఆయన చెప్పారు. ఎటువంటి ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు. -
కేజే కుమార్ అరెస్ట్
నగరి: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి భర్త కేజే కుమార్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత శాంతకుమారి నివాసంపై పోలీసులు దాడి చేశారు. శాంతకుమారి నివాసంలోని గేట్లు పగులగొట్టి కేజే కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పుత్తూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. తన భర్తను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శాంతకుమారి పుత్తూరు పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. తన భర్తకు ప్రాణాహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రోత్సాహంతోనే పోలీసులు తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని వాపోయారు. కేజే కుమార్ అరెస్ట్ పై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి స్పందించారు. నగరిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శించారు. -
నగరిలో పోలీస్ జులుం
-
నగరిలో పోలీస్ జులుం
నగరి: చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధి ఇంటి వద్ద పోలీసులు జులం ప్రదర్శించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు శాంతా కుమారి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. శాంతాకుమారి ఇంటి గేటుకు వేసిఉన్న తాళలను పగలగొట్టిమరీ లోనికి ప్రవేశించిన పోలీసుల తీరుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. శాంతాకుమారి నివాసం వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించేప్రయత్నం చేశారు. ఒక పాత కేసు దర్యాప్తులో భాగంగానే పోలీసులు.. మున్సిపల్ చైర్ పర్సన్ శాంతా కుమారిని, భర్తను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నించారు. కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులపైనే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం వివాదాలకు దారి తీస్తోంది. ఒక ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన శాంతకుమారి కుమారుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.