దేశీయ వలసల్లో భారత్‌ది మూడోస్థానం
ఐక్యరాజ్యసమితి: భారత్‌లో 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోనే వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారని ఓ నివేదిక పేర్కొంది. అంతర్గత వలసలు ఎక్కువగా నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం (ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి (ఎన్‌ఆర్‌సీ)లు కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి. నివేదిక ప్రకారం 2016లో అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలసపోగా, తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్ (59 లక్షల మంది) ఉంది.
ఘర్షణలు, హింస, ప్రకృతి విపత్తులు స్వదేశీ వలసలకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 3.1 కోట్ల మంది స్వదేశాల్లోనే తమ నివాస స్థలాలను మార్చుకోవాల్సి వచ్చింది. 2015లో దక్షిణాసియా దేశాల్లో 79 లక్షల మంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లగా, 2016లో ఈ సంఖ్య సగానికి పైగా తగ్గి 36 లక్షలకు పరిమితమైంది. ఇందులో భారత్ నుంచే 24 లక్షల మంది ఉండడం గమనార్హం. భారత్‌లో బిహార్‌లో గతేడాది జూలై–అక్టోబర్‌ల మధ్య సంభవించిన వరదల వల్లే 16 లక్షల మంది వలసపోయారని నివేదిక వెల్లడించింది.