
పర్వతంపై నుంచి పడ్డ బస్సు; 26 మంది మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు పశ్చిమాన 400 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారు.
గురువారం కిక్కిరిసిన ప్రయాణికులతో, పర్వత ప్రాంతంలో ఇరుకైన రహదారిలో వెళ్తున్న బస్సు అదుపు తప్పింది. దాదాపు 200 మీటర్ల దిగువకు బస్సు దొర్లుకుంటూ వెళ్లి నదిలో పడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను కాపాడి వారిని హెలికాప్టర్లలో నేపాల్ గంజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం మరి కొంతమంది క్షతగాత్రులను రక్షించారు. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగించింది. నేపాల్ లో పర్వత ప్రాంతాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటం, బస్సులు కండీషన్‌లో లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.