నవవధువు ప్రాణం తీసిన ‘సారె’ వివాదం
నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా): కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు అనుమానాస‍్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన‍్నపేట మండలం ముషిడిగట్టులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
గ్రామానికి చెందిన వానపల్లి కుమారి బీఎస్సీ, బీఈడీ చదివింది. ఆమెకు ఇదే గ్రామానికి చెందిన రాజాపు ఉపేంద్రతో ఈ నెల 17న వివాహం జరిగింది. రూ.లక్ష విలువ కలిగిన సారె, కట్నంగా 50 సెంట్లు భూమి ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు రమణ, గన్నెమ్మ దంపతులు ఒప్పుకున్నారు. ఆ ప్రకారం భూమిని ఇచ్చారు. సారె తీసుకొని వరుడి ఇంటికి శుక్రవారం ఉదయం కుమారి కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే, సారె సామాన్లు తక్కువగా తీసుకువచ్చారని వరుడి తల్లి రమణమ్మ , అన్నావదిన ఘర్షణకు దిగారు. అన్ని సామాన్లు తీసుకొచ్చామని.. ఇంకా ఇవ్వాల్సి ఉంటే ఇస్తామని వధువు కుటుంబ సభ్యులు చెబుతున్నా వారు ససేమిరా అన్నారు.
దీన్ని ఇంట్లో నుంచి గమనిస్తున్న నవవధువు కుమారి ఆందోళనకు గురైంది. ఇంటి మొదటి అంతస్తుకు వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. రైతు కుటుంబం కావడంతో పంటలకు వేసేందుకు తీసుకొచ్చి ఉంచిన పురుగు మందు తాగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే కుమారి కుటుంబీకులు మాత్రం అత్తింటివారే చంపేశారని ఆరోపిస్తున్నారు. పెళ్లి కుమారుడు అన్న మురళి, భార్య అనూష కలిసి ఆమెను చంపేశారని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవవధువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస‍్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున‍్నట్టు నరసన్నపేట సీఐ పైడపునాయుడు తెలిపారు.