పక్కనే జైలు గదిలో నరమాంస భక్షకుడు!
పక్కనే జైలు గదిలో నరమాంస భక్షకుడు!
Published Fri, Feb 24 2017 5:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
నిన్న మొన్నటి వరకు ఆయన తిరుగులేని వ్యాపారవేత్త. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. కానీ ఇప్పుడు జైలు గోడల మధ్య జీవితం గడుపుతున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడికి లంచం ఇవ్వజూపిన నేరంలో శాంసంగ్ గ్రూప్ అధిపతి జే లీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేరాలు చేసిన కోటీశ్వరులు, సీరియల్ కిల్లర్లు ఉండే జైల్లో ఆయనను పెట్టారు. లీ పక్క సెల్‌లో ఉండేది ఒక నరమాంస భక్షకుడు. ఆయనకు ఫోన్ గానీ, కంప్యూటర్ గానీ ఏమీ ఇవ్వలేదు. దాదాపు రోజంతా తన సెల్‌లో ఉండిపోవాల్సిందే. అయితే తన న్యాయవాదితో మాత్రం ఎంతసేపు కావాలంటే అంతసేపు వేరే గదిలో మాట్లాడుకోవచ్చు.
మరోవైపు అసలు తాము ఎలాంటి నేరం చేయలేదని జే లీతో పాటు శాంసంగ్ కంపెనీ కూడా చెబుతోంది. అయితే దర్యాప్తు పూర్తయితే తప్ప ఈ కేసు పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. జే లీకి జైల్లో ఖైదీలందరూ వేసుకునే మామూలు నీలిరంగు యూనిఫామే ఇచ్చారు. తన సెల్ బయట రోజుకు ఒక గంట పాటు కావాలంటే వ్యాయామం చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్ సదుపాయం అందుబాటులో లేదు. ఆయన సెల్‌లో ఒక టీవీ మాత్రం ఉంది. అయితే అది శాంసంగ్ టీవీ కాదు, ఆయన ప్రత్యర్థి కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తయారుచేసిన టీవీ!!
Advertisement