మధ్యవర్తిత్వానికి శాంతి నోబెల్
టునీసియా ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’కు పురస్కారం
♦ ‘మల్లెల విప్లవ’ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు కృషి
♦ ఒక్కటైన విరుద్ధ వర్గాలు.. ప్రభుత్వ, విపక్షాల మధ్య రాజీ
♦ కొత్త రాజ్యాంగం, ప్రజాస్వామ్యంతో విలసిల్లుతున్న టునీసియా
ఓస్లో: ‘మల్లెల విప్లవం’ అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)’కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ ‘క్వార్టెట్’ కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. ఈ పురస్కారం టునీసియాలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పాటు అందించలగలదని ఆశిస్తున్నట్లు తెలిపింది.
2011లో టునీసియాలో నిరంకుశ ప్రభుత్వంపై చెలరేగిన తిరుగుబాటు.. ఆ తర్వాత వరుసగా అరబ్ దేశాల్లో విప్లవాలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనినే ‘మల్లెల విప్లవం (జాస్మిన్ రివల్యూషన్)’గా పిలుస్తారు. దీని కారణంగా చాలా అరబ్ దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు కూలిపోయి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటుకావడానికి మార్గం ఏర్పడింది. అయితే ఈ తిరుగుబాటు అనంతరం టునీసియాలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో పరస్పర విరుద్ధ వర్గాలైన కార్మికులు, పారిశ్రామికవేత్తలు, మానవహక్కుల సంఘాలు, న్యాయవాదులు ఏకమయ్యారు.
ఆ దేశానికి చెందిన ‘టునీసియన్ జనరల్ లేబర్ యూనియన్, టునీసియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ హాండిక్రాఫ్ట్స్, టునీసియన్ హ్యూమన్ రైట్స్ లీగ్, టునీసియన్ ఆర్డర్ ఆఫ్ లాయర్స్’ సంస్థలు కలసి 2013లో ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’గా ఏర్పడ్డాయి. ఇస్లామిక్ వాదుల ఆధిపత్యంలోని ప్రభుత్వానికి, తిరుగుబాటు లేవదీసిన విపక్షాలకు ఈ ‘క్వార్టెట్’ మధ్యవర్తిత్వం వహించింది. విస్తృత చర్చల ద్వారా అన్నివర్గాల మధ్య రాజీ కుదిర్చి.. శాంతికి, ప్రజాస్వామ్యానికి బాటలు వేసింది.
తద్వారా టునీసియా కొత్త రాజ్యాంగాన్ని రచించుకున్నది. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’కు నార్వే నోబెల్ కమిటీ ‘శాంతి’ నోబెల్‌ను ప్రకటించింది. టునీసియా ‘క్వార్టెట్’కు ఇచ్చిన ఈ పురస్కారం... మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో కూడా శాంతిని, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకునేలా స్ఫూర్తిని కలిగిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇతర దేశాలు కూడా టునీసియా అడుగుజాడల్లో నడిచేందుకు ప్రేరణ కలిగిస్తుందని నోబెల్ కమిటీ వ్యాఖ్యానించింది.
అవార్డు గెలుచుకున్న సంస్థలు
►టునీసియన్ జనరల్ లేబర్ యూనియన్: ఇది టునీసియాలోని అతిపెద్ద,అతి పురాతన కార్మిక సంఘం. 1946లో ప్రారంభమైన ఈ సంస్థకు 5,17,000 మంది సభ్యులున్నారు. తిరుగుబాటు సమయంలో ఇస్లామిక్ ప్రభుత్వానికి, రెబెల్స్‌కు మధ్య చర్చలకు కీలక పాత్ర పోషించి, రాజకీయ మధ్యవర్తిత్వం కూడా నెరిపింది.
►టునీసియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్: పారిశ్రామిక, వాణిజ్య, హస్తకళల సంస్థల ప్రాతినిధ్య సంస్థ. 1947లో ఏర్పడిన ఈ సంస్థలో 1.50 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సభ్యత్వం ఉంది. రెబెల్స్ ప్రతిపాదనలకు ఛాందస ప్రభుత్వ వర్గాలను ఒప్పించడంలో దీనిది కీలక పాత్ర.
►టునీసియన్ హ్యూమన్ రైట్స్ లీగ్: 1976 నుంచి టునీసియాలో మానవహక్కుల కోసం పోరాడుతున్న సంస్థ. టునీసియాలో మరణశిక్షకు వ్యతిరేకంగా దశాబ్దాల పోరాటం జరిపింది. మతాచారాలకు వ్యతిరేకించి జైలు పాలైన వారిని విడిపించేందుకు కృషి చేసింది. చర్చల ప్రక్రియలో, రాజ్యాంగ నిర్మాణంలో గణనీయ పాత్ర పోషించింది.
►టునీసియన్ ఆర్డర్ ఆఫ్ లాయర్స్: టునీసియాలోని న్యాయవాదులంతా సభ్యులుగా ఉన్న సంస్థ. మధ్యవర్తిత్వంలో, రాజ్యాంగ చర్చల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది.
‘చర్చలే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయన్న సందేశం ఇచ్చే అవార్డ్ ఇది. ఆయుధాలు పక్కనబెట్టి చర్చల ప్రక్రియ ప్రారంభించాలంటూ మా ప్రాంతంవారికి సందేశాన్నిస్తోంది’
- హుస్సేన్ అబ్బాసీ, టునీసియన్ జనరల్ లేబర్ యూనియన్ చీఫ్