దేశంలో ఎక్కడా అసహనం లేదు!
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. సహచర బృందంతో రాష్ట్రపతి భవన్‌కు మార్చ్
న్యూఢిల్లీ: అసహనంపై నిరసనలకు, ‘అవార్డ్ వాపసీ’ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆధ్వర్యంలో శనివారం పలువురు రచయితలు, సినీ కళాకారులు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రపూరిత ఉద్దేశంతోనే ప్రభుత్వ పురస్కారాలను వెనక్కిస్తున్నారని ఖేర్ ఆరోపించారు. భారతదేశం సహనశీల దేశమని, భారతీయులంతా లౌకికవాదులేనన్నారు. హత్యలను ఖండించాల్సిందేనని, అయితే, ఈ ఘటనలను చూపుతూ ప్రపంచం దృష్టిలో భారత్ పరువు తీస్తున్నారని విమర్శించారు. దేశంలో అసహనం పెరుగుతోందన్న ప్రచారం కొందరే చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు అవార్డ్‌లు వెనక్కిస్తున్నవారంతా గతంలో ప్రధాని అభ్యర్థిగా మోదీని వ్యతిరేకించిన వారేనని ర్యాలీలో పాల్గొన్న దర్శకుడు జాతీయ పురస్కార గ్రహీత మాధుర్ భండార్కర్ అన్నారు. అవార్డ్‌లను వెనక్కివ్వడాన్ని పిల్ల చేష్టని డెరైక్టర్ ప్రియదర్శన్ అన్నారు. ర్యాలీ తర్వాత రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. దానిపై కమల్ హాసన్, శేఖర్ కపూర్, వివేక్ ఒబేరాయ్, విద్యాబాలన్ సహా 90 మంది సంతకాలు చేశారు. తర్వాత ఖేర్ బృందం ప్రధాని మోదీని కలిసింది.
అసహనాన్ని మించిన భారత సంస్కృతి: మోదీ
అసహనాన్ని మించిన సంస్కృతి భారత దేశానిదని.. దీనికి ప్రతిదాన్ని స్వీకరించటమే తప్ప తిరస్కరించటం తెలియదని ప్రధాని మోదీ తెలిపారు. అసహనంపై కాంగ్రెస్, లెఫ్ట్ మేధావుల నిరసనలకు వ్యతిరేకంగా ఖేర్ నాయకత్వంలో 51 మంది కళాకారులు మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కాంగ్రెస్‌ది రక్షణాత్మక ధోరణి’
‘అసహనం’పై ఆగ్రహ వ్యక్తీకరణలో మేధావులు కాంగ్రెస్‌నూ లక్ష్యంగా చేసుకున్నారు. మతవాదాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతోందంటూ మండిపడ్డారు. అనాసక్త, పశ్చాత్తాపపూరిత లౌకిక విధానాన్ని పాటిస్తోందని, మతతత్వంపై రక్షణాత్మక ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు దేశంలో పెరుగుతున్న అసహన వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేశారు.