చెప్పినట్లే వస్తారా? | special story on upcoming bollywood movies on 2019 | Sakshi
Sakshi News home page

చెప్పినట్లే వస్తారా?

Published Sun, Mar 17 2019 12:19 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

special story on upcoming bollywood movies on 2019 - Sakshi

మాధురి, వరుణ్, సంజయ్‌ దత్, ఆలియా, ఆదిత్యారాయ్, సోనాక్షి

చూస్తుండగానే గడియారంలోని మల్లు గిరగిరా తిరిగి సెకన్లు, నిముషాలు, గంటలు కరిగిపోయి క్యాలెండర్లో రోజులు మారిపోతున్నాయి. సెట్స్‌లో ఉన్న సినిమాలు షెడ్యూల్స్‌ను కంప్లీట్‌ చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నాయి. సినీ లవర్స్‌ అందరూ ఎప్పటికప్పుడు సినిమా స్టేటస్‌ తెలుసుకుంటుంటారు. యూనిట్‌ నుంచి రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ రంజాన్‌కి రానుంది. అజయ్‌దేవగణ్‌ ‘దే దే ప్యార్‌ దే’ (మే 17), హృతిక్‌రోషన్‌ ‘సూపర్‌ 30’ (జూలై 26), అక్షయ్‌ కుమార్‌ ‘కేసరి’ (మార్చి 21), ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ (మే 10) వంటి చిత్రాల విడుదల తేదీలు ఎప్పుడో ఖరారయ్యాయి. ఇప్పుడు గడచిన ఆరేడు రోజుల్లో విడుదల తేదీలు ఖరారైన చిత్రాల గురించి తెలుసుకుందాం. మరి.. చెప్పిన తేదీకే వస్తారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘నరేంద్ర మోదీ’ ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నరేంద్ర మోదీ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ కనిపిస్తారు. రాజకీయాల్లో మోదీ సాధించిన విజయాలు, ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం గురించిన అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. నిజ జీవితం ఆధారంగా మోదీ వస్తే.. కల్పిత కథతో ‘కళంక్‌’ రెడీ అయింది. సరిగ్గా మోదీ వచ్చిన ఐదు రోజులకు ఈ పీరియాడికల్‌ మూవీ రానుంది. సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్‌ ధావన్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యా రాయ్‌కపూర్‌ ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘కళంక్‌’.

‘2 స్టేట్స్‌’ ఫేమ్‌ అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించారు. 1921 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇటీవల టీజర్‌ విడుదలైంది. ‘కళంక్‌ నహీ..ఇష్క్‌ హై’ అనే డైలాగ్‌తో టీజర్‌ కంప్లీట్‌ అవుతుంది. దీన్నిబట్టి ఇది లవ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే రివెంజ్‌ డ్రామా అని తెలుస్తోంది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఒకటి రియల్‌ లైఫ్, మరోటి ఫిక్షన్‌.. ఆ తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే సినిమాలందు సినిమాలు వేరయా అన్నట్లు.. తెరపైకి వచ్చే సినిమాల మీదా ఆడియన్స్‌ దృష్టి ఉండదు. కొన్ని సినిమాల మీదే ఉంటుంది. అలా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో చాలామంది దృష్టిని ఆకర్షించిన ఓ నవలాచిత్రం ఉంది. అనూజా చౌహన్‌ రచించిన ‘ది జోయా ఫ్యాక్టర్‌’ నవల ఆధారంగా అదే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది.

ఇందులో దుల్కర్‌ సల్మాన్, సోనాక్షీ సిన్హా జంటగా నటిస్తున్నారు. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 14న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. కథేంటంటే.. ఒక అడ్వరై్టజింగ్‌ ఏజెన్సీకి చెందిన ఓ అమ్మాయితో టిఫిన్‌ చేస్తే.. ఆ తర్వాత ఆడబోయే మ్యాచ్‌లో విజయం సాధిస్తాం అని నమ్ముతాడు ఓ క్రికెటర్‌. ఆ నమ్మకం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే విషయాలపై ఈ సినిమా ఉంటుంది. ఇందులో నిఖిల్‌ పాత్రలో దుల్కర్, జోయా పాత్రలో సోనాక్షి కనిపిస్తారు. నవలా చిత్రాల విభాగంలో ఈ ఏడాది ‘దిల్‌ బేచరా’ అనే మరో సినిమా ఉంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, సంజనా షాంఘి జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఏడాది నవంబర్‌ 29న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది.

ఈ చిత్రానికి ముఖేష్‌ చబ్రా దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత జాన్‌ గ్రీన్‌ రచించిన ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్యానర్స్‌కు గురైన ఓ యువకుడు, ఓ యువతిల ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ప్రేమకథలు, యాక్షన్‌ స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్‌ ఎప్పుడూ వస్తుంటాయి. వీటితో పాటు ప్రతి ఏడాదీ కొన్ని దేశభక్తి చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈ ఏడాది రానున్న దేశభక్తి చిత్రాల్లో ‘మర్‌జవాన్‌’ ఒకటి. ‘సత్యమేవ జయతే’ ఫేమ్‌ మిలప్‌ జవేరి దర్శకత్వంలో సిద్దార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ ముఖ్, రకుల్‌ ప్రీత్‌సింగ్, తారా సుతారియా ముఖ్య పాత్రలుగా ఈ చిత్రం రూపొందింది. నాజర్‌ కీలకపాత్ర చేశారు. దేశభక్తి సినిమా కాబట్టి విడుదలకు అక్టోబర్‌ 2 అనుకున్నారు. యాక్షన్, లవ్, పీరియాడికల్‌ మూవీస్‌ సిల్వర్‌ స్క్రీప్‌పై సందడి చేస్తున్న సమయంలో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అంటూ ఓ సెంటిమెంట్‌ మూవీ రావడానికి రెడీ అయింది.

ప్రియాంకా చోప్రా, ఫర్హాన్‌ అక్తర్, ‘దంగల్‌’ ఫేమ్‌ జైరా వసీమ్‌ ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అనారోగ్యంతో బాధపడే ఓ కూతరి కోసం ఓ తల్లి పడే తాపత్రయం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌. జైరా వసీమ్‌కు తల్లి పాత్రలో ప్రియాంకా చోప్రా నటించారని తెలిసింది. ఢిల్లీకి చెందిన మోటివేషనల్‌ స్పీకర్‌ ఆశా చౌదరి పాత్రలో నటించారట జైరా వసీమ్‌. సోనాలీ బోస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటి విడుదల తేదీలు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ప్రకటించిన తేదీకన్నా ముందే విడుదల అవ్వొచ్చు... వాయిదా పడొచ్చు. ఎప్పుడో విడుదల చేద్దామనుకున్న సినిమాను త్వరగా పూర్తి చేసి, విడుదల చేయొచ్చు. ఈ ఏడాది విడుదల అనుకున్న సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడొచ్చు. ఇండస్ట్రీలో ఇలా జరగడం సహజం. అందుకే  ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బొమ్మ వచ్చిందా? లేదా? అన్నదే ప్రేక్షకులకు ముఖ్యం.


వివేక్‌ ఒబెరాయ్‌


దుల్కర్, సోనమ్‌


సిద్ధార్థ్, మిలప్‌


ప్రియాంకా చోప్రా...


సుశాంత్, సంజన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement