Film artists
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో కేన్సర్ ఉచిత స్క్రీనింగ్
బంజారాహిల్స్/రాయదుర్గం: రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ కార్మికులు, మెగా అభిమానుల కోసం కేన్సర్ ఉచిత స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు సినీనటుడు చిరంజీవి ప్రకటించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లోని స్టార్ ఆస్పత్రి కేన్సర్ సెంటర్ సహకారంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బ్లడ్ బ్యాంకులో, నానక్‌రాంగూడ స్టార్ ఆస్పత్రి కేన్సర్ సెంటర్ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రాణాంతకమైన కేన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని, అందుకే ఈ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని చెప్పారు. జూలై 9న జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో స్క్రీనింగ్ ఉంటుందని, రోజూ వెయ్యి మందికి కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రెండుమూడు రోజుల్లో సినీ కార్మి క సంఘాల నాయకులతో సమావేశమై, స్క్రీనింగ్ కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. 16న వైజాగ్‌లో, 23న కరీంనగర్లో.. మెగా అభిమానులకోసం జూలై 9న హైదరాబాద్‌లో, 16న వైజాగ్‌లో, 23న కరీంనగర్లో కేన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో ఈ స్క్రీనింగ్ నెలకు ఒకసారి చేపడతామని, క్రమక్రమంగా ఈ సేవలను మరింతగా విస్తరించాలని నిర్ణయించామని వెల్లడించారు. స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించడానికి ముందుకొచ్చిన స్టార్ ఆస్పత్రి యాజమాన్యాన్ని చిరంజీవి అభినందించారు. స్టార్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నెం గోపీచంద్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగు నెలలపాటు ఈ స్క్రీనింగ్ చేపడతామన్నారు. పొగ తాగేవారు, పాన్ మసాలా నమిలేవాళ్లను ముందుగా గుర్తించి స్క్రీనింగ్ చేస్తామని, మహిళలు కూడా స్వయంగా తమకు తామే గుర్తుపట్టే విధంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. కేన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత తొందరగా నియంత్రించవచ్చన్నారు. -
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం విషయంలో యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ఏటీఎఫ్ పీజీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో నటీ నటులతో పాటు టెక్నీషియన్ల పారితోషికాన్ని 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రోజుకు 20 వేల రూపాయాలకు పైగా పారితోషికం తీసుకునే నటీనటులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే ఒక సినిమాకు ఐదు లక్షల రూపాయలకు పైగా పారితోషికం తీసుకునే టెక్నీషియన్లకు కూడా 20 శాతం కోత తప్పదని తేల్చి చెప్పింది. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా), ఏటీఎఫ్ పీజీ మధ్య అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది. పారితోషికం కోత నిర్ణయానికి సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు సహకరించాలని ఏటీఎఫ్ పీజీ విజ్ఞప్తి చేసింది. త్వరలోనే సినీ ఇండస్ట్రీ మంచి రోజులు వస్తాయని ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆశాభావం వ్యక్తం చేసింది. -
పేద సినీ కార్మికులకు సహాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ (సీసీసీ) ప్రారంభించారు. నటీనటుల సహా పలువురు దాతల నుంచి సీసీసీకి విరాళాలు వెల్లువెత్తాయి. ముందే ప్రకటించినట్లు ఈ ఆదివారం నుంచి 24 శాఖల్లోని పేద కార్మికులకు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ బృందం నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ –‘‘సినీపరిశ్రమలోని ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఆదివారం స్టూడియోస్ విభాగం కార్పెంటర్స్కి సరుకులు అందించాం. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి నెలా సరుకులు కార్మికుల ఇంటికే చేరతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయిన చిరంజీవిగారితో సహా దాతలందరికీ కృతజ్ఞతలు. ‘సీసీసీ మనకోసం’ కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ , బెనర్జీ.. ఇలా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అన్నారు. -
ఐదు లక్షలు విరాళం
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో రోజువారీ వేతనంతో బతికే పేద కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వీవీ వినాయక్ ఐదు లక్షలు విరాళం అందించారు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌కు ఆయన ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మనం ఇళ్లల్లో ఉండి వణికించాలి. షూటింగ్స్ లేకపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కి అందజేశా. అవసరమైనవారు కిరణ్‌ని సంప్రదించి నిత్యావసర వస్తువులను తీసుకోవాలి’’ అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ, వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. -
నన్ను ఏ రాజకీయ పార్టీ తీసుకోదు: నటి
సాక్షి, న్యూఢిల్లీ : ముఖం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ.. వివాదాలతో సావాసం చేసే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘రైజింగ్ ఇండియా సమ్మిట్’ లో కంగన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ రంగం అద్భుతమైనది అన్నారు. కానీ ఫ్యాషన్‌గా ఉండే తన లాంటి వారిని ఏ రాజకీయ పార్టీలు తీవుకోవని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే చాలా ఇష్టమని, కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని కంగనా తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి తాను పెద్ద అభిమానినని, ఆయనే తనకి రోల్ మోడల్ అని వెల్లడించారు. ‘నేను కూడా ఆయనలాగా ఎదగాలని కోరుకుంటున్నాను. చాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయి వరకు ఎదిగిన మోదీ విజయ గాథ యువతకు ఆదర్శం’అని అన్నారు. చాయ్‌వాలాను ప్రధానిని చేసిన గొప్ప ప్రజాస్వామ్య దేశం మన ఇండియా అని కొనియాడారు. జాతీయవాదాన్ని గూర్చి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా పురోగతి సాధిస్తే దేశ పురోగతికి సాయం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ‘ఒక యువతిగా నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. అందరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ఆమె అన్నారు. ‘భారత్‌లో పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను భారతీయురాలిని. అదే నా గుర్తింపు’ అని కంగనా అన్నారు. భారత్‌లో ఉన్న పాకిస్తానీ కళాకారుల వివాదం గూర్చి మాట్లాడుతూ.. కళాకారులకు ప్రాంతీయభేదం లేదని, వారిది వేరే రాజ్యమని అన్నారు. కళాకారులకు మతాలు, కులాలు, సరిహద్దులు ఉండవని, అంతా ఒకటేనని, వారిది కళాత్మక రాజ్యం అని కంగనా తన అభిప్రాయాన్ని వెలువరించారు. -
దేశంలో ఎక్కడా అసహనం లేదు!
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. సహచర బృందంతో రాష్ట్రపతి భవన్‌కు మార్చ్ న్యూఢిల్లీ: అసహనంపై నిరసనలకు, ‘అవార్డ్ వాపసీ’ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆధ్వర్యంలో శనివారం పలువురు రచయితలు, సినీ కళాకారులు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రపూరిత ఉద్దేశంతోనే ప్రభుత్వ పురస్కారాలను వెనక్కిస్తున్నారని ఖేర్ ఆరోపించారు. భారతదేశం సహనశీల దేశమని, భారతీయులంతా లౌకికవాదులేనన్నారు. హత్యలను ఖండించాల్సిందేనని, అయితే, ఈ ఘటనలను చూపుతూ ప్రపంచం దృష్టిలో భారత్ పరువు తీస్తున్నారని విమర్శించారు. దేశంలో అసహనం పెరుగుతోందన్న ప్రచారం కొందరే చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు అవార్డ్లు వెనక్కిస్తున్నవారంతా గతంలో ప్రధాని అభ్యర్థిగా మోదీని వ్యతిరేకించిన వారేనని ర్యాలీలో పాల్గొన్న దర్శకుడు జాతీయ పురస్కార గ్రహీత మాధుర్ భండార్కర్ అన్నారు. అవార్డ్‌లను వెనక్కివ్వడాన్ని పిల్ల చేష్టని డెరైక్టర్ ప్రియదర్శన్ అన్నారు. ర్యాలీ తర్వాత రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. దానిపై కమల్ హాసన్, శేఖర్ కపూర్, వివేక్ ఒబేరాయ్, విద్యాబాలన్ సహా 90 మంది సంతకాలు చేశారు. తర్వాత ఖేర్ బృందం ప్రధాని మోదీని కలిసింది. అసహనాన్ని మించిన భారత సంస్కృతి: మోదీ అసహనాన్ని మించిన సంస్కృతి భారత దేశానిదని.. దీనికి ప్రతిదాన్ని స్వీకరించటమే తప్ప తిరస్కరించటం తెలియదని ప్రధాని మోదీ తెలిపారు. అసహనంపై కాంగ్రెస్, లెఫ్ట్ మేధావుల నిరసనలకు వ్యతిరేకంగా ఖేర్ నాయకత్వంలో 51 మంది కళాకారులు మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ది రక్షణాత్మక ధోరణి’ ‘అసహనం’పై ఆగ్రహ వ్యక్తీకరణలో మేధావులు కాంగ్రెస్‌నూ లక్ష్యంగా చేసుకున్నారు. మతవాదాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతోందంటూ మండిపడ్డారు. అనాసక్త, పశ్చాత్తాపపూరిత లౌకిక విధానాన్ని పాటిస్తోందని, మతతత్వంపై రక్షణాత్మక ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు దేశంలో పెరుగుతున్న అసహన వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేశారు.