సాక్షి, అమరావతి : కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం విషయంలో యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ఏటీఎఫ్ పీజీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో నటీ నటులతో పాటు టెక్నీషియన్ల పారితోషికాన్ని 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రోజుకు 20 వేల రూపాయాలకు పైగా పారితోషికం తీసుకునే నటీనటులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే ఒక సినిమాకు ఐదు లక్షల రూపాయలకు పైగా పారితోషికం తీసుకునే టెక్నీషియన్లకు కూడా 20 శాతం కోత తప్పదని తేల్చి చెప్పింది. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా), ఏటీఎఫ్ పీజీ మధ్య అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది. పారితోషికం కోత నిర్ణయానికి సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు సహకరించాలని ఏటీఎఫ్ పీజీ విజ్ఞప్తి చేసింది. త్వరలోనే సినీ ఇండస్ట్రీ మంచి రోజులు వస్తాయని ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment