
జెయింట్‌వీల్ కూలి ఒకరి మృతి
చెన్నైలోని కిష్కింధ ఎమ్యూజ్‌మెంట్ పార్కులో కొత్తగా పెట్టిన డిస్కో జెయింట్‌వీల్ కుప్పకూలి ఒక వ్యక్తి మరణించాడు.
అమ్యూజ్‌మెంట్ పార్కులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. సరికొత్త రెయిడ్లతో పిల్లలను ఆకట్టుకునేందుకు పార్కులు పోటీపడుతుంటాయి. ఇలాగే చెన్నైలోని కిష్కింధ ఎమ్యూజ్‌మెంట్ పార్కులో కొత్తగా డిస్కో జెయింట్‌వీల్‌ను ఏర్పాటుచేశారు. అయితే అది కాస్తా కుప్పకూలి ఒక వ్యక్తి మరణించాడు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వారందరినీ తాంబరంలోని దీపం ఆస్పత్రికి తరలించారు.
కొత్తగా బిగించిన డిస్కో జెయింట్‌వీల్‌ను పరీక్షిస్తున్న సమయంలోనే అది కూలిపోయిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డీసీపీ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన పార్కు యజమాని జోష్ పునిష్, మేనేజర్ శాంతివేలంలను అరెస్టుచేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 337, 304 (2)ల కింద కేసులు నమోదు చేశారు.