మలేసియా వెళ్లాల్సిన విమానం మెల్ బోర్న్ వెళ్లింది!
సిడ్నీ: సిడ్నీ నగరం నుంచి మలేసియాకు బయల్దేరిన ఎయిర్ ఏషియా ఎక్స్ విమానం పైలట్ తప్పిదంతో వేరే ప్రాంతంలో ల్యాండ్ అయింది. విమానంలో సరైన ప్రాంతంలో పైలట్ కూర్చొకపోవడమే ఇందుకు ప్రధానకారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. విమానాన్ని కౌలాలంపూర్ వైపు మలిచే సమయంలో గాలి ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానం తప్పుదోవలో వెళ్తున్నట్లు హెచ్చరికలు జారీ చేశాయని తెలిపారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయగా పరిస్థితి మరింత జఠిలమైనట్లు వివరించారు.
దీంతో పైలట్ విమానాన్ని మెల్ బోర్న్ లో ల్యాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్ మెంట్ సిస్టం, గైడెన్స్ సిస్టంలలో తప్పిదాల కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. సిబ్బంది తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎయిర్ ఏషియా మిగతా పైలట్లతో పంచుకుందని వెల్లడించారు. దీని ద్వారా కొత్త తరహా ట్రైనింగ్ మాడ్యూల్ ను కూడా అభివృద్ధి చేసుకున్నట్లు వివరించారు.