జోరుగా మహిళా డెరైక్టర్ల నియామకం
డెడ్‌లైన్‌కు ముందు రోజు
కార్పొరే ట్ల హడావుడి
కుమార్తెలు, భార్యలకు బోర్డుల్లో స్థానం
ముంబై: లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో మహిళా డెరైక్టర్లు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన అమలుకు ఆఖరు రోజున కార్పొరేట్లు భారీగా నియామకాలు చేపట్టాయి. కొత్తగా నియమితులైన వారిలో చాలా మంది ప్రమోటర్లు లేదా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కుటుంబ సభ్యులే. వీరిలో పలువురు ఆయా టాప్ ప్రమోటర్ల కుమార్తెలు, భార్యలు లేదా సోదరీమణులు కావడం గమనార్హం. కొందరు కార్పొరేట్లు ప్రస్తుత ం ఉన్న స్వతంత్ర డెరైక్టర్లను కూడా తొలగించి తమ కుటుంబ సభ్యులను నియమించుకున్నారు. అయితే, వీరంతా కూడా ప్రమోటర్ల గళమే వినిపిస్తారని, దీని వల్ల అసలు నిబంధన విధించడం వెనుకనున్న లక్ష్యమే దెబ్బతింటుందని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా అభిప్రాయపడ్డారు. మహిళా డెరైక్టర్ల నియామకాలు చేపట్టిన సంస్థల్లో జీవీకే పవర్, అమర రాజా బ్యాటరీస్, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, షెమారూ ఎంటర్‌టైన్‌మెంట్, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ తదితర సంస్థలు ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి అన్ని లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక్క మహిళా డెరైక్టర్ అయినా ఉండాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. కంపెనీల బోర్డుల్లో పురుషులతో పాటు మహిళలకూ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో సెబీ ఈ నిబంధన ప్రవేశపెట్టింది. వాస్తవానికి గతేడాది అక్టోబర్ 1 దీనికి డెడ్‌లైన్ అయినప్పటికీ ఆ తర్వాత ఏప్రిల్ 1 దాకా పొడిగించింది. నిబంధన పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సెబీ చైర్మన్ యూకే సిన్హా హెచ్చరించారు. దీంతో ఈ నిబంధన మేరకు మంగళవారం 250 వరకూ కంపెనీలు బోర్డు సమావేశాలు నిర్వహించి, నియామకాలు చేపట్టాయి. కాగా, సోమవారం కూడా 200 కంపెనీలు మహిళా డెరైక్టర్లను నియమించుకున్నాయి.
సీఏలకు, బ్యాంకర్లకు ప్రాధాన్యం..
గడిచిన కొద్ది రోజులుగా స్వతంత్ర డెరైక్టర్లుగా మహిళలను నియమించుకున్న కంపెనీలు ఎక్కువగా చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంకర్లకు ప్రాధాన్యమిచ్చారు. యునెటైడ్ బ్రూవరీస్ వంటి కొన్ని కంపెనీలు విదేశీ మహిళలను నియమించుకోగా.. మరికొన్ని సంస్థలు సీనియర్లను ప్రమోట్ చేశాయి. కాగా, సెబీ నిబంధనల అమలు కోసం మరింత మంది మహిళా చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను డెరైక్టర్లుగా నియమించుకునే అవకాశాన్ని కంపెనీలు పరిశీలించవచ్చని ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం తమ సంస్థలో 40,000 పైచిలుకు మహిళా సీఏలు ఉన్నారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ మనోజ్ ఫడ్నిస్ చెప్పారు. ఇందులో కొందరు ఇప్పటికే కొన్ని కంపెనీల బోర్డుల్లో ఉన్నారని వివరించారు.