బై ది ఉమెన్‌ ఫర్‌ ది ఉమెన్‌ | Kalakari film festival by Rishi Nikam to focus on women filmmakers | Sakshi
Sakshi News home page

బై ది ఉమెన్‌ ఫర్‌ ది ఉమెన్‌

Published Fri, Oct 22 2021 1:35 AM | Last Updated on Fri, Oct 22 2021 5:23 AM

Kalakari film festival by Rishi Nikam to focus on women filmmakers - Sakshi

‘ఫిల్మ్‌మేకర్‌ కావాలనుకుంటున్నాను’ అని మగవాళ్లు అంటే అభ్యంతర పెట్టేవాళ్లు, భయపెట్టేవాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు. అదే మహిళల విషయానికి వచ్చేసరికి మాత్రం ‘ఎందుకు వద్దంటే...’ అంటూ చాంతాడంత జాబితా తయారవుతుంది. ఈ నేపథ్యంలో ‘మీరు విన్నవి అపోహ లు మాత్రమే. వాస్తవాలు కాదు’ అనే స్పష్టత ఇవ్వడానికి, ‘మీ ప్రతిభ  నిరూపించుకోండి’ అని ధైర్యం చెప్పడానికి వ్యక్తులే కాదు వేదిక కూడా ముఖ్యమే అంటోంది ముంబైకి చెందిన రిషి నికమ్‌.

చిత్రసీమలోని ఆయా విభాగాలలో స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడానికి, తనలాగే ఆలోచించే మరికొద్దిమందితో కలిసి ‘బై ది ఉమెన్‌–ఫర్‌ ది ఉమెన్‌’ కాన్సెప్ట్‌ తో ‘కళాకారి’ వేదికకు ఊపిరి పోసింది. ఈ వేదిక తరపున మహిళల చేత రూపుదిద్దుకున్న ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రపంచంలోని పలు భాషల చిత్రాలను ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నిజానికి ఇవి సినిమాలు కాదు తమను ఉత్తేజపరిచే పాఠాలు. çకళాకారి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మహిళా దర్శకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. మహిళాదర్శకుల చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. ‘ఇది మన ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అనే భావన కలుగుతుంది.

‘చైనీస్‌ ఫిమేల్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ క్లోయే జావో తొలిరోజుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తరువాత తనను తాను నిరూపించుకుంది. బెస్ట్‌ డైరెక్టర్‌గా అవార్డ్‌ అందుకున్న జావోకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘సాంగ్స్‌ మై బ్రదర్‌ టాట్‌ మీ’ అన్నాచెల్లెళ్ల్ల అనుబంధాన్ని అద్భుతంగా చూపింది. అది చైనీస్‌ ఫిల్మ్‌ అనిపించదు. అదేదో మన పక్కింట్లో జరుగుతున్నట్లు ఉంటుంది. డైరెక్టర్‌ గొప్పదనం అదే. అలాంటి డైరెక్టర్లు మన దగ్గర కూడా తయారుకావాలి’ అంటుంది రిషి.

‘ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పాల్గొనడం వలన ఏమిటి ప్రయోజనం?’ అనే ప్రశ్నకు ‘మంచి అనుభూతి మిగులుతుంది’ అనేది సంతృప్తికరమైన జవాబు కాదు. ‘కళాకారి’ నిర్వాహకులలో ఒకరైన ప్రియా యాదవ్‌ మాటల్లో చెప్పాలంటే...‘అక్కడ చిత్రాలను చూడడం మాత్రమే కాదు...ఇరాన్‌ నుంచి చైనా వరకు తమను ఇన్‌స్పైర్‌ చేసే చిత్రదర్శకుల గురించి మాట్లాడు కుంటారు. కొత్త విషయాలెన్నో తెలుసుకుంటారు. ఆ తరువాత ప్రముఖ మహిళా దర్శకులు తమ అనుభవాలను వివరిస్తారు. ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారు మొదలైన విషయాల గురించి మాట్లాడతారు. తర్వాత రకరకాల టాపిక్స్‌పై చర్చ జరుగుతుంది. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత!

ఏదో దయతలిచి సినిమారంగంలో మహిళలకు అవకాశం ఇవ్వమని అడగడం ఈ వేదిక ఉద్దేశం కాదు. చిత్రపరిశ్రమలో లింగవివక్షత ఉండకూడదు అని డిమాండ్‌ చేయడం మాత్రమే. సినిమా రంగంలో మహిళల ప్రతిభ గురించి చరిత్ర పుటలు తిరిగేస్తే  తెలుస్తుంది’ ‘కళాకారి’ లక్ష్యం విజయవంతం కావాలని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement