women directors
-
వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్
సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ? హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది. సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. (చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం) సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్‌తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్ అని ఆ మధ్య తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. (చదవండి: హీరోయినే..హీరో) వైజాగ్‌లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. సమంత హిట్స్ లిస్ట్‌పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి. లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్‌లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్ బుక్‌లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్‌గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్‌తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు. -
పోరాట స్ఫూర్తి
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ మొదలైంది. చిత్రాభిమానుల విశిష్ట పండగ లో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. మొదటి విశేషం... చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే సగం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మహిళా దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైన బంగ్లాదేశ్ చిత్రం ‘రెహన మరియమ్ నూర్’ మహిళల సమస్యను ప్రతిబింబిస్తుంది. 37 సంవత్సరాల రెహన మెడికల్ కాలేజి ప్రొఫెసర్. ఒక బిడ్డకు తల్లిగా, అమ్మకు కూతురిగా, సోదరుడికి అక్కగా ఆమె వ్యక్తిగత జీవితానికి, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితానికి మధ్య సమన్వయం, వాటి మధ్య తలెత్తే వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.రెండో విశేషం... ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుర్దిష్ ఫిల్మ్‌మేకర్ లిసా కలన్ను ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారంతో సత్కరిస్తారు. కొన్ని నిజజీవిత కథలు, కల్పన కంటే ఆశ్చర్యపరుస్తాయి. ‘లిసా కలన్’ది అచ్చంగా అలాంటి కథ... ఐసిస్ ఉగ్రవాదుల బాంబుదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకుంది లిసా. అయితే ఆమె పోగొట్టుకుంది కాళ్లు మాత్రమే. ఆమెలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూసుకుపోయే తత్వం ఎక్కడికీ పోలేదు. ‘హిడెన్’ అనే సినిమాకు ఆర్ట్‌డైరెక్టర్‌గా వ్యవహరించడంతో పాటు నటించింది. ‘వాయిస్ ఆఫ్ ది స్ట్రీట్’ సినిమాకు సౌండ్ అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించింది. ఎన్నిరకాల సృజనాత్మక బాధ్యతలను చేపట్టినా ఆమె నమ్మిన సూత్రం ... బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించాలని. ఇందుకు చిత్రాలను బలమైన ఆయుధంగా ఎంచుకుంది. టర్కీలోని కుర్ద్‌ల కుటుంబంలో పుట్టిన లిసా, బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. రాజ్యహింసను దగ్గర నుంచి చూసింది. హైస్కూల్ చదువుతోనే ఆమె చదువు ఆగిపోయింది. దీనికి కారణం...పై చదువులు తన మాతృభాషలో కాకుండా ‘టర్కిష్’లో మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండడం. చదువుకు దూరమైనప్పటికీ ‘అరమ్ టైగ్రన్ సిటీ కన్జర్వేటరీ’లో సినిమా పాఠాలు చదువుకుంది. విస్తృతమైన ప్రపంచాన్ని చూసింది. సినిమా కోర్స్ తన మాతృభాష లోనే ఉండడం ఆమెకు బాగా నచ్చిన విషయం. ఈ చిత్రకళల ఆలయంలో తాను గడిపిన రెండు సంవత్సరాల కాలం విలువైనది. విలువల గురించి తెలుకునేలా చేసింది. ఆ తరువాత... ఊరు, వాడ, పల్లె, పట్లణం అనే తేడా లేకుండా కుర్దుల జీవితాన్ని చూడడానికి తిరిగింది. ముఖ్యంగా కుర్దీష్ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు లిసాను కదిలించాయి. వారి ఆత్మగౌరవ పోరాటం ఆకట్టుకుంది. తాను చూసిన దృశ్యాలను పొలిటికల్ డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికి చూపింది. మృత్యువు ఎదురొచ్చిన రోజు... జూన్, 2015లో దియర్బకిర్ నగరంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొంది లిసా. పార్టీని లక్ష్యంగా చేసుకొని ‘ఐసిస్’ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృత్యువు అంచుల వరకు వెళ్లింది లిసా. రెండు కాళ్లు పోగొట్టుకుంది. ‘లిసా బతకడం అరుదైనఅదృష్టం’ అన్నారు. మంచమే ఆమె ప్రపంచం అయింది. తాను అమితంగా ప్రేమించిన చిత్రప్రపంచం దూరమైపోయింది. ‘ఇంటిపట్టునే ఉండు తల్లీ ఎందుకొచ్చిన కష్టాలు!’ అన్నవాళ్లతోపాటు– ‘రెండు కాళ్లే పోయినప్పుడు, ఇంట్లో పడుండక ఏమి చేస్తుంది’ అని వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆరు సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. వేరే వాళ్లలో అయితే జీవన ఆసక్తి అంటూ లేకుండా పోయేదేమోగానీ లిసా మాత్రం మళ్లీ అడుగులు వేసింది. ఈసారి కృత్రిమకాళ్లతో! గతంలోలాగే ఉద్యమాలలో భాగం అయింది. చిత్రాలను తీయడం మొదలు పెట్టింది. ‘ఎందరి జీవితాలనో తెరకెక్కించింది లిసా. నిజానికి ఆమె జీవితమే ఒక అద్భుతమై చిత్రం’ అనే మాట తిరువనంతపురం చిత్రోత్సవంలో నలుమూలలా వినిపిస్తూనే ఉంది. -
సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు
న్యూఢిల్లీ: క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా ఇద్దరు మహిళా డైరెక్టర్లను నియమించుకుంది. కార్పొరేట్ పాలన నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర డైరెక్టర్ల హోదాలో మంజు అగర్వాల్, ఎస్.వసంత్ కారన్‌జ్‌కర్‌లను ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ విభాగాలలో వీరికి సీనియారిటీ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బోర్డులో మహిళా డైరెక్టర్ల సంఖ్య మూడుకు చేరినట్లు తెలియజేసింది. ఆరుగురు సభ్యుల బోర్డుకు చైర్‌పర్శన్, నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామలా గోపీనాథ్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ సుపరిపాలన విషయంలో కంపెనీ పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు తాజా ఎంపికలు నిదర్శనాలని సీఎంఎస్ ఇన్ఫో పేర్కొంది. తద్వారా ముగ్గురు లేదా అంతకుమించి మహిళా డైరెక్టర్లు కలిగిన ఎన్ఎస్ఈ టాప్–10 శాతం లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించినట్లు వివరించింది. బ్యాక్‌గ్రౌండ్..: అగర్వాల్ ఎస్బీఐలో 34ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. దేశ, విదేశాలలో రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీసులు, వ్యూహాలు, నిర్వహణ తదితర విభాగాలలో విధులు చేపట్టారు. ఇక వసంత్ కారన్‌జ్‌కర్ కన్జూమర్ లెండింగ్ సంస్థ పేసెన్స్‌కు సహవ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. బిజినెస్, వృద్ధి, నిర్వహణ విభాగాలకు అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. పేయూ క్రెడిట్ ఇండియాకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పేసెన్స్ పురోగతి సాధించాక పేయూ ఇండియాకు చెందిన నాస్పెర్స్‌కు విక్రయించారు. -
బై ది ఉమెన్ ఫర్ ది ఉమెన్
‘ఫిల్మ్‌మేకర్ కావాలనుకుంటున్నాను’ అని మగవాళ్లు అంటే అభ్యంతర పెట్టేవాళ్లు, భయపెట్టేవాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు. అదే మహిళల విషయానికి వచ్చేసరికి మాత్రం ‘ఎందుకు వద్దంటే...’ అంటూ చాంతాడంత జాబితా తయారవుతుంది. ఈ నేపథ్యంలో ‘మీరు విన్నవి అపోహ లు మాత్రమే. వాస్తవాలు కాదు’ అనే స్పష్టత ఇవ్వడానికి, ‘మీ ప్రతిభ నిరూపించుకోండి’ అని ధైర్యం చెప్పడానికి వ్యక్తులే కాదు వేదిక కూడా ముఖ్యమే అంటోంది ముంబైకి చెందిన రిషి నికమ్. చిత్రసీమలోని ఆయా విభాగాలలో స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడానికి, తనలాగే ఆలోచించే మరికొద్దిమందితో కలిసి ‘బై ది ఉమెన్–ఫర్ ది ఉమెన్’ కాన్సెప్ట్ తో ‘కళాకారి’ వేదికకు ఊపిరి పోసింది. ఈ వేదిక తరపున మహిళల చేత రూపుదిద్దుకున్న ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రపంచంలోని పలు భాషల చిత్రాలను ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నిజానికి ఇవి సినిమాలు కాదు తమను ఉత్తేజపరిచే పాఠాలు. çకళాకారి ఫిల్మ్ ఫెస్టివల్లో మహిళా దర్శకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. మహిళాదర్శకుల చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. ‘ఇది మన ఫిల్మ్ ఫెస్టివల్’ అనే భావన కలుగుతుంది. ‘చైనీస్ ఫిమేల్ ఫిల్మ్ డైరెక్టర్ క్లోయే జావో తొలిరోజుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తరువాత తనను తాను నిరూపించుకుంది. బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకున్న జావోకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్ ‘సాంగ్స్ మై బ్రదర్ టాట్ మీ’ అన్నాచెల్లెళ్ల్ల అనుబంధాన్ని అద్భుతంగా చూపింది. అది చైనీస్ ఫిల్మ్ అనిపించదు. అదేదో మన పక్కింట్లో జరుగుతున్నట్లు ఉంటుంది. డైరెక్టర్ గొప్పదనం అదే. అలాంటి డైరెక్టర్లు మన దగ్గర కూడా తయారుకావాలి’ అంటుంది రిషి. ‘ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పాల్గొనడం వలన ఏమిటి ప్రయోజనం?’ అనే ప్రశ్నకు ‘మంచి అనుభూతి మిగులుతుంది’ అనేది సంతృప్తికరమైన జవాబు కాదు. ‘కళాకారి’ నిర్వాహకులలో ఒకరైన ప్రియా యాదవ్ మాటల్లో చెప్పాలంటే...‘అక్కడ చిత్రాలను చూడడం మాత్రమే కాదు...ఇరాన్ నుంచి చైనా వరకు తమను ఇన్స్పైర్ చేసే చిత్రదర్శకుల గురించి మాట్లాడు కుంటారు. కొత్త విషయాలెన్నో తెలుసుకుంటారు. ఆ తరువాత ప్రముఖ మహిళా దర్శకులు తమ అనుభవాలను వివరిస్తారు. ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారు మొదలైన విషయాల గురించి మాట్లాడతారు. తర్వాత రకరకాల టాపిక్స్‌పై చర్చ జరుగుతుంది. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత! ఏదో దయతలిచి సినిమారంగంలో మహిళలకు అవకాశం ఇవ్వమని అడగడం ఈ వేదిక ఉద్దేశం కాదు. చిత్రపరిశ్రమలో లింగవివక్షత ఉండకూడదు అని డిమాండ్ చేయడం మాత్రమే. సినిమా రంగంలో మహిళల ప్రతిభ గురించి చరిత్ర పుటలు తిరిగేస్తే తెలుస్తుంది’ ‘కళాకారి’ లక్ష్యం విజయవంతం కావాలని ఆశిద్దాం. -
కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాల కంటే..
ముంబై: బోర్డుల్లో మహిళా ప్రాధాన్యతలో ఇతర పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే కార్పొరేట్ ఇండియా వెనుకడుగులో ఉంది. అయితే ఇటీవల కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. దీంతో తాజాగా మహిళా డైరెక్టర్ల శాతం 17.3 శాతానికి బలపడింది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 24 శాతంగా నమోదైనట్లు క్రెడిట్ స్వీస్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 46 దేశాలలో 3,000 కంపెనీలకు చెందిన 33,000 మంది ఎగ్జిక్యూటివ్స్‌ను పరిగణనలోకి తీసుకుని సర్వేను తయారు చేసినట్లు క్రెడిట్ స్వీస్ తెలియజేసింది. వీటిలో 12 ఆసయా పసిఫిక్ మార్కెట్లలోని 1,440 సంస్థలను సైతం కవర్ చేసినట్లు పేర్కొంది. అయితే సర్వేలో దేశీయంగా ఎన్ని కంపెనీలూ, ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిందీ క్రెడిట్ స్వీస్ వెల్లడించలేదు. నివేదికలోని ఇతర అంశాలు చూద్దాం.. 2015తో పోలిస్తే.. గత ఆరేళ్లలో దేశీ కార్పొరేట్ బోర్డుల్లో స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. దీంతో 2015లో వీరి సంఖ్య 11.4 శాతంగా నమోదుకాగా.. 2021కల్లా మరో 6 శాతం పుంజుకుంది. ఈ బాటలో గత రెండేళ్లలో యాజమాన్యంలోనూ స్త్రీ ప్రాతినిధ్యం 2 శాతం బలపడింది. ఫలితంగా 2019లో నమోదైన 8 శాతం వాటా 2021కల్లా 10 శాతానికి చేరింది. కాగా.. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో 17.3 శాతం వాటాతో ఎపాక్ ప్రాంతంలో భారత్ మూడో కనిష్ట ర్యాంకులో చేరింది. దక్షిణ కొరియా(8 శాతం), జపాన్(7 శాతం) కంటే ముందు నిలిచింది. మహిళా సీఈవోలలో 5 శాతం, సీఎఫ్వోలలో 4 శాతం వాటాను కలిగి ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కుటుంబ సభ్యులుకాకుండా స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ను తప్పనిసరి చేసినప్పటికీ చాలా కంపెనీలు నిబంధనలు పాటించడంలో వెనుకబడి ఉన్నాయి. ఇక ప్రపంచస్థాయిలో 2015–2021 మధ్య కాలంలో బోర్డులో మహిళల ప్రాతినిధ్యం 8.9 శాతంమేర పెరిగింది. యూరప్‌లో 34.4 శాతం, ఉత్తర అమెరికాలో 28.6 శాతం చొప్పున మహిళలకు ప్రాధాన్యత లభిస్తోంది. ఆసియా పసిఫిక్ సగటు 17.3 శాతంకాగా.. లాటిన్ అమెరికాలో ఇది 12.7 శాతంగా నమోదైంది. చదవండి: ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది! -
లేడీబాస్
-
డైరెక్ట్ చేస్తున్నారు..!
బోర్డు రూమ్‌లలోనూ మహిళల సత్తా.. ♦ ప్రతి లిస్టెడ్ కంపెనీలో కనీసం ఓ మహిళా డైరెక్టర్ ♦ సెబీ ఆదేశాలతో కంపెనీలో ప్రతిభావంతులకు చోటు ♦ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా, సీఈఓలుగా రాణింపు ♦ నిఫ్టీ–50లో సెబీ ఆదేశాలను పాటించనివి ఐదు సంస్థలే (సాక్షి, బిజినెస్ విభాగం) ఆకాశంలో సగం. సాక్షాత్తూ శివుడిలోనూ సగం. అన్నింటా సగమే!!! మరి బోర్డ్ రూమ్‌లో..? అంటే కంపెనీల డైరెక్టర్ల బోర్డులో..! సగం ఉన్నారా? పోనీ పావు..? అర్ధ పావు..? ఇవన్నీ కాదు కానీ... కనీసం ఒక మహిళా డైరెక్టరయినా తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే!! లేకపోతే జరిమానాలు తప్పవు! అంటూ మూడేళ్ల కిందట స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆదేశించింది. 2014 అక్టోబర్ దాకా గడువిచ్చింది. లాభం లేకపోవటంతో మరో ఆరునెలలు పెంచింది. అయినా కొన్ని కంపెనీలు పాటించలేదు. రూ.50వేల జరిమానాతో 2015 జూన్ వరకూ గడువుపెట్టింది. అప్పటికీ పట్టించుకోని వారు... రూ.50వేలతో పాటు మహిళా డైరెక్టర్‌ను నియమించేదాకా రోజుకు రూ.1,000 చొప్పున కట్టాల్సిందేనంది. ఇక 2015 జూలై 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరులోపు గనక మహిళా డైరెక్టర్లను నియమించకుంటే... రూ.1.42 లక్షల జరిమానాతో పాటు జూలై 1 నుంచి రోజుకు రూ.5వేల చొప్పున కూడా చెల్లించాలంది. అప్పటికీ నియమించకుంటే..? వారిపై తగు చర్యలు తీసుకుంటామని సెబీ స్పష్టంగా చెప్పింది. ఆ చర్యలేంటో మాత్రం చెప్పలేదు లెండి!! ఇంతకీ జరిగిందేంటంటే... చాలా కంపెనీలు సెబీ ఆదేశాల్ని పాటించాయి. కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ను నియమించాయి. కొన్నయితే ప్రమోటర్ల కుటుంబీకుల్నే డైరెక్టర్లుగా బోర్డులోకి తెచ్చేశాయి. దురదృష్టమేంటంటే... ఇన్ని ఆదేశాలిచ్చిన సెబీ బోర్డులో ఇప్పటికీ ఒక మహిళా డైరెక్టర్ కూడా లేరు. ఇన్ని చేసినా ఇప్పటికీ మహిళా డైరెక్టర్‌ను నియమించని కంపెనీల్ని చూస్తే అందులో కేంద్రానికి చెందినవే ఎక్కువున్నాయి. అదీ... మన బోర్డ్‌రూమ్‌ల కథ. చిన్నా చితకా కంపెనీలన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా... ఎన్ఎస్ఈలో టాప్–50గా పరిగణించే ‘నిఫ్టీ’ కంపెనీల్లో ఈ నియమాన్ని ఎంతవరకు పాటించారనేది ‘సాక్షి’ పరిగణనలోకి తీసుకుంది. ఆయా వివరాల సమాహారమే ఈ ఉమెన్స్‌డే ప్రత్యేక కథనం... తప్పనిసరి తంతు... కొన్నింటికే!! మహిళా డైరెక్టర్లను తప్పనిసరిగా పెట్టాలి కనక... ఆ నిబంధనల్ని పూర్తి చేయటానికి తమ కుటుంబంలోనే ఎవరో ఒకరిని బోర్డులోకి తీసుకున్న గ్రూపులు, సంస్థలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే హెచ్‌సీఎల్, రిలయన్స్ వంటి సంస్థలు తమ కుటుంబీకుల్ని బోర్డులోకి తీసుకున్నా... వారు కూడా ఆయా రంగాల్లో నిపుణులు, విద్యాధికులు కావటం, మేనేజ్మెంట్లో ఆరితేరిన వారు కావటం గమనార్హం. ఇక మిగిలిన కంపెనీలు చూస్తే... అత్యధికం విద్యాధికుల్ని, ప్రొఫెషనల్స్‌ను, సంస్థను సమర్థంగా నడిపించగలిగే వారినే తీసుకున్నాయి. పలువురు మహిళలు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నా... బోర్డు నిర్ణయాల్లో తప్పొప్పులు ఎంచగల సమర్థులే. నిపుణులు ఏలుతున్నారు..! మహిళలు డైరెక్టర్లుగా ఉండటమే కాక... వారే అన్నీ అయి నడిపిస్తున్న కంపెనీలూ నిఫ్టీలో చాలానే ఉన్నాయి. ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ చీఫ్‌గా చందా కొచర్, యాక్సిస్ అధిపతిగా శిఖా శర్మ... వీళ్లంతా ఆయా సంస్థల్ని విజయవంతంగా నడిపిస్తున్న వారే. యాక్సిస్‌ను విజయవంతంగా నడిపించిన శిఖాశర్మ... ఏకంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పాఠ్యాంశమయ్యారు కూడా. సిప్లాలో డైరెక్టర్‌గా ఉన్న నైనాలాల్ కిద్వాయ్... భారత్‌లో విదేశీ బ్యాంకుకు (హెచ్ఎస్బీసీ) నేతృత్వం వహించిన తొలి మహిళగానే కాక... ఫిక్కీ అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ప్రస్తుతం మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో డైరెక్టరుగా ఉన్న శ్యామల గోపీనాథ్... దానికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈమె గతంలో ఆర్బీఐ డిప్యూటీ డైరెక్టర్‌గానూ పనిచేశారు. ఇన్ఫోసిస్ బోర్డులో ఉన్న కిరణ్ మజుందార్ షా... బయోకాన్ చైర్పర్సన్, ఎండీ కూడా. ఐటీసీ బోర్డులో ఉన్న నిరుపమారావు... ఇండియన్ ఫారీన్ సర్వీస్ మాజీ ఉద్యోగిని. విదేశాంగ శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు. ఐటీసీతోపాటు ఆమె కేఈసీ ఇంటర్నేషనల్, నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్, టీవీ 18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ కంపెనీల బోర్డుల్లోనూ ఉన్నారు. ఐటీసీలో మరో మహిళా డైరెక్టరుగా ఉన్న మీరా శంకర్.. గతంలో విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. మహీంద్రా లైఫ్‌స్పేస్ సీఈఓగా ఉన్న అనితా దాస్... ఎం అండ్ ఎం డైరెక్టర్. ప్రమోటర్లూ రాణిస్తున్నారు... లుపిన్ కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్న వినితా గుప్తా... దాని ప్రమోటరు కూడా. ఇక బిర్లా గ్రూపు సంస్థల్లో డైరెక్టరుగా ఉన్న రాజశ్రీ బిర్లా... పద్మ విభూషణ్ అందుకున్నారు. రిలయన్స్ బోర్డులోని నీతా అంబానీ... రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కూడా. హెచ్‌సీఎల్ బోర్డులో ఉన్న రోష్ని నాడార్... హెచ్‌సీఎల్ సీఈఓ, ఈడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్ బోర్డులో ఉన్న మల్లికా శ్రీనివాసన్... ప్రపంచంలో మూడో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ టఫే (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్)కు చైర్పర్సన్, సీఈవో కూడా. చోటివ్వనివి ప్రభుత్వ కంపెనీలే! నిఫ్టీ–50 కంపెనీల్లో ఐదింట్లోనే ఇప్పటికీ మహిళలకు చోటు దక్కలేదు. వీటిలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలే కావటం గమనార్హం. ప్రభుత్వ రంగ భెల్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ప్రయివేటు బ్యాంకింగ్ సంస్థలు యస్ బ్యాంక్, బాష్ మాత్రం ఇంకా తమ బోర్డులో మహిళలకు చోటివ్వలేదు. అన్నిటికన్నా చిత్రమేం టంటే... ఈ నియమం తెచ్చిన స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డులో ఇప్పటిదాకా మహిళలకు స్థానం దక్కలేదు. కంపెనీ బోర్డుల్లో మహిళలు 2 శాతమే ప్రపంచంలో ఎక్కడా స్త్రీ, పురుష సమానత్వం రాలేదు. భారత్‌లో ఇంకొన్ని దశాబ్దాలు పడుతుంది. సాంస్కృతికంగా మనుషుల ఆలోచనా ధోరణి మారాలి. పని ప్రదేశాల్లో మహిళలూ సమానమేననే భావన రావాలి. మహిళల్లో కూడా మార్పు కావాలి. ఆర్థిక వ్యవస్థలో తామూ భాగమేనన్న బాధ్యతను స్త్రీలు తీసుకోవాలి. విధాన నిర్ణేతల్లో మహిళలు లేరు. డెసిషన్ మేకర్‌గా ఎదిగినప్పుడే ఆడవాళ్లకు ప్రాధాన్యత పెరుగుతుంది. వాళ్లు కంపెనీలో కీలక స్థానంలో ఉంటేనే కదా... స్త్రీ, పురుష సమానత్వానికి కృషి చేసేది? ఎక్కువ మంది ఆడవాళ్లను నియమించుకోవచ్చు కూడా. దేశవ్యాప్తంగా కంపెనీల్లో బోర్డు స్థాయిలో మహిళలు 2 శాతం లోపే. వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారిలో స్త్రీలు 16 శాతమే. పెళ్లయ్యాక కుటుంబ సభ్యుల సహకారం ఉండటం లేదు. 5–10 ఏళ్లకే ఉద్యోగాలు మానేస్తున్నారు. అందుకే సీనియర్ లెవెల్‌కి ఎదగడం లేదు. మా కంపెనీలో 40 శాతం మంది మహిళలున్నారు. పలు దేశాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కాబట్టే అక్కడ సమానత్వం ఉంది. మహిళా దినోత్సవాలకే కాకుండా ఏడాది పొడవునా స్త్రీల అభ్యున్నతి గురించి చర్చ జరగాలి. – వనిత దాట్ల వైస్ చైర్పర్సన్, ఎలికో. డిప్యూటీ చైర్‌వుమన్, ఇండియన్ వుమెన్ నెట్వర్క్, సీఐఐ సౌత్. ప్రాజెక్టులు సాధించడంలో తీసిపోరు స్త్రీ, పురుషులు సమానమనే భావన ఇప్పుడిప్పుడే పెరిగింది. సాధించాల్సిందింకా ఉంది. స్త్రీ, పురుషులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదు. చాలా విషయాల్లో ఆడవాళ్లు తమ సత్తా చాటారు. కంపెనీల ఏర్పాటు, బ్యాంకుల నుంచి రుణం పొందడం, ప్రాజెక్టులు సాధించడంలో ఎవరికీ తీసిపోవడం లేదు. మహిళలు ఏదైనా సాధిస్తారు. కావాల్సిందల్లా ధైర్యమే. లింగ వివక్ష ప్రతిచోటా ఉంది. కొన్ని సందర్భాల్లో ‘నో’ అని చెప్పాలనుకున్నప్పటికీ చెప్పలేకపోతున్నారు. విషయం ఏదైనా సూటిగా చెప్పాల్సిందే. కెరీర్ పరంగా ఫ్యామిలీ సహకారం అడగాలి. నేను బాధ్యతలు తీసుకోకముందు మా కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్య 10 శాతం లోపే. ఇప్పుడు 30 శాతం పైగా ఉన్నారు. వీ6 న్యూస్ చానెల్లో 90 శాతం మహిళలే. కుటుంబ సభ్యుల సహకారం ఉంది కనకే ఇప్పుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బాధ్యతలూ స్వీకరించా. – జి.సరోజ వివేకానంద్, ఎండీ, విశాక ఇండస్ట్రీస్. -
జోరుగా మహిళా డెరైక్టర్ల నియామకం
డెడ్‌లైన్‌కు ముందు రోజు కార్పొరే ట్ల హడావుడి కుమార్తెలు, భార్యలకు బోర్డుల్లో స్థానం ముంబై: లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో మహిళా డెరైక్టర్లు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన అమలుకు ఆఖరు రోజున కార్పొరేట్లు భారీగా నియామకాలు చేపట్టాయి. కొత్తగా నియమితులైన వారిలో చాలా మంది ప్రమోటర్లు లేదా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కుటుంబ సభ్యులే. వీరిలో పలువురు ఆయా టాప్ ప్రమోటర్ల కుమార్తెలు, భార్యలు లేదా సోదరీమణులు కావడం గమనార్హం. కొందరు కార్పొరేట్లు ప్రస్తుత ం ఉన్న స్వతంత్ర డెరైక్టర్లను కూడా తొలగించి తమ కుటుంబ సభ్యులను నియమించుకున్నారు. అయితే, వీరంతా కూడా ప్రమోటర్ల గళమే వినిపిస్తారని, దీని వల్ల అసలు నిబంధన విధించడం వెనుకనున్న లక్ష్యమే దెబ్బతింటుందని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా అభిప్రాయపడ్డారు. మహిళా డెరైక్టర్ల నియామకాలు చేపట్టిన సంస్థల్లో జీవీకే పవర్, అమర రాజా బ్యాటరీస్, ల్యాంకో ఇన్ఫ్రాటెక్, కేఎస్కే ఎనర్జీ వెంచర్స్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, షెమారూ ఎంటర్టైన్మెంట్, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ తదితర సంస్థలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి అన్ని లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక్క మహిళా డెరైక్టర్ అయినా ఉండాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. కంపెనీల బోర్డుల్లో పురుషులతో పాటు మహిళలకూ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో సెబీ ఈ నిబంధన ప్రవేశపెట్టింది. వాస్తవానికి గతేడాది అక్టోబర్ 1 దీనికి డెడ్‌లైన్ అయినప్పటికీ ఆ తర్వాత ఏప్రిల్ 1 దాకా పొడిగించింది. నిబంధన పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సెబీ చైర్మన్ యూకే సిన్హా హెచ్చరించారు. దీంతో ఈ నిబంధన మేరకు మంగళవారం 250 వరకూ కంపెనీలు బోర్డు సమావేశాలు నిర్వహించి, నియామకాలు చేపట్టాయి. కాగా, సోమవారం కూడా 200 కంపెనీలు మహిళా డెరైక్టర్లను నియమించుకున్నాయి. సీఏలకు, బ్యాంకర్లకు ప్రాధాన్యం.. గడిచిన కొద్ది రోజులుగా స్వతంత్ర డెరైక్టర్లుగా మహిళలను నియమించుకున్న కంపెనీలు ఎక్కువగా చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంకర్లకు ప్రాధాన్యమిచ్చారు. యునెటైడ్ బ్రూవరీస్ వంటి కొన్ని కంపెనీలు విదేశీ మహిళలను నియమించుకోగా.. మరికొన్ని సంస్థలు సీనియర్లను ప్రమోట్ చేశాయి. కాగా, సెబీ నిబంధనల అమలు కోసం మరింత మంది మహిళా చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను డెరైక్టర్లుగా నియమించుకునే అవకాశాన్ని కంపెనీలు పరిశీలించవచ్చని ఐసీఏఐ, ఐసీఎస్ఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం తమ సంస్థలో 40,000 పైచిలుకు మహిళా సీఏలు ఉన్నారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ మనోజ్ ఫడ్నిస్ చెప్పారు. ఇందులో కొందరు ఇప్పటికే కొన్ని కంపెనీల బోర్డుల్లో ఉన్నారని వివరించారు. -
'ఆమె' కోసం కుస్తీలు...
ముంబై: దేశీయ కంపెనీల్లో మహిళా డైరెక్టర్లను నియమించుకోవడానికి సెబి విధించిన గడువు మార్చి 31తో ముగియనుంది. అయినా ఇంతవరకు ఏ ఒక్క కంపెనీ దీనిపై స్పష్టమైన వైఖరిని వెల్లడించిన దాఖలు లేవు. పైగా ఆయా కంపెనీలు మహిళా అభ్యర్థుల కోసం వెతుకులాడుతున్నట్టు సమాచారం. దాదాపు 300 మంది కంపెనీలు తమ తమ బోర్టుల్లో మహిళా డైరెక్టర్ల నియామకం కోసం కుస్తీలు పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బజాజ్ ఆటో డైరెక్టర్ గీతి పిరామల్ సెబీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురుషాధిక్య బోర్డులు ఇపుడే నిద్రలేచాయని.... హఠాత్తుగా మహిళల్ని డైరెక్టర్లుగా నియమించాల్సిన పరిస్థితికి వారు నెట్టబడ్డారన్నారు. మహిళలు లేకుండా బోర్టును నడపడం ఇపుడు వారికి సాధ్యంకాదని, ఇది మంచి పరిణామమని ఆమె అన్నారు. ప్రైమ్ డేటాబేస్ అధ్యయనం ప్రకారం దాదాపు యాభైశాతం కంపెనీలు తమ బంధువులైన అక్క, చెల్లి, భార్యలను మాత్రమే సభ్యులను చేర్చుకుంటున్నారనే చేదు నిజం వెల్లడైంది. ఈ పద్ధతి ఇకనైనా మారాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హాల్దియా అభిప్రాయపడ్డారు. 2014 ఫిబ్రవరిలో బోర్డులో ఒక మహిళా డైరెక్టర్ ఉండాలని సెబి ఆదేశించింది. ఇందుకు తొలుత అక్టోబర్1ని డెడ్‌లైన్‌గా పేర్కొంది. అయితే అనంతరం ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ గడువును ఇకపై పొడిగించేది లేదని సెబి చైర్మన్ యుకె సిన్హా స్పష్టం చేశారు. దీనికనుగుణంగా ప్రవర్తించని కంపెనీలకు జరిమానా తప్పదని, మార్చి నెలాఖరు కల్లా ప్రతి ఒక్క లిస్టెడ్ కంపెనీ తన బోర్డులో కనీసం ఒక్క మహిళనైనా నియమించుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి!
- దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఒకటీ రెండు కాదు... ఏకంగా 44 చిత్రాలు రూపొందించి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’కు కూడా ఎక్కిన ఘనత నటి విజయ నిర్మలది. ఆమె సినీ జీవిత విశేషాలు, అరుదైన ఫోటోలతో సీనియర్ సినీ జర్నలిస్ట్ యు. వినాయకరావు ‘గిన్నీస్‌బుక్ విజేత’ పేరిట ఒక పుస్తకం రాశారు. విజయనిర్మల 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈ పుస్తకావిష్క రణ జరిగింది. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు పుస్త కాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని హీరో కృష్ణ స్వీకరించారు. మలిప్రతిని సీనియర్ సినీ జర్నలిస్టు బి.ఏ. రాజు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు అభిమానులు, సినీ శ్రేయోభిలాషుల మధ్య విజయనిర్మల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనిర్మల కుమారుడు - నటుడు నరేశ్‌తో పాటు సీనియర్ సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతి, నటి జయసుధ, నటుడు ‘గుండు’ సుదర్శన్, దర్శకురాలు బి.జయ, నిర్మాత ‘పద్మా లయ’ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘విజయ నిర్మల స్ఫూర్తితో మరింత మంది మహిళా దర్శకులు పరిశ్రమకు రావాలి’’ అని రాఘవేంద్రరావు అభిప్రాయపడగా, ‘‘విజయనిర్మలపై పుస్తకం వెలువడిన ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది’’ అని కృష్ణ పేర్కొన్నారు. ‘‘ఈ పుస్తకం విజయ నిర్మల గారికి నేనిస్తున్న పుట్టినరోజు కానుక’’ అని వ్యాఖ్యానించిన వినాయకరావు త్వరలోనే హీరో కృష్ణపై ‘దేవుడు లాంటి మనిషి’ అనే పెద్ద పుస్తకాన్ని వెలువరించ నున్నట్లు ప్రకటించారు. మహేశ్‌బాబు అభిమాన సంఘాల ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దయెత్తున వచ్చి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. -
ఇక తెర వెనుక...యాక్షన్!
కథానాయికగా పలు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ ఇప్పుడు దర్శకురాలిగా మారుతున్నారు. ప్రస్తుతం దర్శకత్వం గురించి మెలకువలు తెలుసుకుంటున్నారు. మహిళా దర్శకులు కూడా ఇలాంటి పవర్ఫుల్ చిత్రాలు తీయగలరా అనే స్థాయిలో ఆమె తీసే సినిమా ఉంటుందట.