'ఆమె' కోసం కుస్తీలు...
ముంబై: దేశీయ కంపెనీల్లో మహిళా డైరెక్టర్లను నియమించుకోవడానికి సెబి విధించిన గడువు మార్చి 31తో ముగియనుంది. అయినా ఇంతవరకు ఏ ఒక్క కంపెనీ దీనిపై స్పష్టమైన వైఖరిని వెల్లడించిన దాఖలు లేవు. పైగా ఆయా కంపెనీలు మహిళా అభ్యర్థుల కోసం వెతుకులాడుతున్నట్టు సమాచారం. దాదాపు 300 మంది కంపెనీలు తమ తమ బోర్టుల్లో మహిళా డైరెక్టర్ల నియామకం కోసం కుస్తీలు పడుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు బజాజ్ ఆటో డైరెక్టర్ గీతి పిరామల్ సెబీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురుషాధిక్య బోర్డులు ఇపుడే నిద్రలేచాయని.... హఠాత్తుగా మహిళల్ని డైరెక్టర్లుగా నియమించాల్సిన పరిస్థితికి వారు నెట్టబడ్డారన్నారు. మహిళలు లేకుండా బోర్టును నడపడం ఇపుడు వారికి సాధ్యంకాదని, ఇది మంచి పరిణామమని ఆమె అన్నారు.
ప్రైమ్ డేటాబేస్ అధ్యయనం ప్రకారం దాదాపు యాభైశాతం కంపెనీలు తమ బంధువులైన అక్క, చెల్లి, భార్యలను మాత్రమే సభ్యులను చేర్చుకుంటున్నారనే చేదు నిజం వెల్లడైంది. ఈ పద్ధతి ఇకనైనా మారాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హాల్దియా అభిప్రాయపడ్డారు.
2014 ఫిబ్రవరిలో బోర్డులో ఒక మహిళా డైరెక్టర్ ఉండాలని సెబి ఆదేశించింది. ఇందుకు తొలుత అక్టోబర్1ని డెడ్‌లైన్‌గా పేర్కొంది. అయితే అనంతరం ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ గడువును ఇకపై పొడిగించేది లేదని సెబి చైర్మన్ యుకె సిన్హా స్పష్టం చేశారు. దీనికనుగుణంగా ప్రవర్తించని కంపెనీలకు జరిమానా తప్పదని, మార్చి నెలాఖరు కల్లా ప్రతి ఒక్క లిస్టెడ్ కంపెనీ తన బోర్డులో కనీసం ఒక్క మహిళనైనా నియమించుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.