
టెక్ ఆధారిత చర్యలను ప్రకటించిన సెబీ
ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల లాగిన్‌ను మరింత భద్రంగా మార్చే దిశగా కీలక చర్యలను సెబీ(SEBI) ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకమీదట అ«దీకృత యూజర్లే వారి ట్రేడింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వగలరు. యూనిక్ క్లయింట్ కోడ్ (యూసీసీ)–డివైజ్–సిమ్ ఈ మూడింటితో కూడిన సిమ్ బైండింగ్ విధానాన్ని తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదన. యూపీఐ యాప్ అన్నది ఒక మొబైల్‌లో ఒకే యూజర్‌తో ఎలా అనుసంధానం అయి ఉంటుందో.. ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా సైతం యూజర్ మొబైల్‌తో అనుసంధానమై ఉంటుంది. యూపీఐ లావాదేవీల సమయంలో యూపీఐ అప్లికేషన్ క్లయింట్ సిమ్, మొబైల్ డివైజ్, వారి బ్యాంక్ ఖాతాలను గుర్తించిన తర్వాతే ప్రాసెస్ చేస్తుంది. అదే మాదిరిగా ట్రేడింగ్ అప్లికేషన్ సైతం యూజర్ యూసీసీ, సిమ్, మొబైల్ డివైజ్ నిజమైనవని ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్‌కు వీలు కల్పిస్తుంది.
యూనిక్ క్లయింట్ కోడ్‌కు క్లయింట్ మొబైల్ నంబర్, డివైజ్ ఐఎంఈఐ నంబర్‌ను లింక్ చేయడాన్ని సెబీ ప్రతిపాదించింది. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా లాగిన్ అవ్వాలంటే.. సోషల్ మీడియా యాప్‌ల మాదిరే టైమ్ సెన్సిటివ్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సిటివ్ క్యూఆర్ కోడ్ ఆథెంటికేషన్ ద్వారే చేయాల్సి వస్తుంది. అలాగే, ట్రేడింగ్ యాప్‌లోకి బయోమోట్రిక్ ధ్రువీకరణతోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పత్రిపాదనలపై సలహా, సూచనలను మార్చి 11 లోపు తెలియజేయాలని సెబీ కోరింది.
ఏఎంసీలు సకాలంలో పెట్టుబడి పెట్టాల్సిందే
నూతన ఫండ్ పథకం (ఎన్‌ఎఫ్‌వో) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను నిర్దేశిత సమయంలోపు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలంటూ నిబంధనలను సెబీ సవరించింది. అలాగే, పారదర్శకత పెంపుకోసం మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను సైతం ఇన్వెస్టర్లకు తెలియజేయడాన్ని కూడా తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. మరింత జవాబుదారీతనం, ఇన్వెస్టర్లలో విశ్వాసం, మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్వహణ సౌలభ్యం తీసుకొచ్చే దిశగా సెబీ ఈ చర్యలు తీసుకుంది.
ఇదీ చదవండి: స్మార్ట్ టీవీలకు జియో ఆపరేటింగ్ సిస్టమ్
ఎన్‌ఎఫ్‌వో ముగిసిన అనంతరం, పథకం పెట్టుబడుల విధానానికి అనుగుణంగా నిర్దేశిత సమయంలోపు ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు సెబీ బోర్డు గత డిసెంబర్‌లో ఆమోదం తెలపడం గమనార్హం. సాధారణంగా ఈ గడువు 30 రోజులుగా ఉంటుంది. ఎన్‌ఎఫ్‌వో ముగిసిన అనంతరం 30 రోజుల్లో ఇన్వెస్ట్ చేయకపోతే.. ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ (చార్జీ) చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు ఏఎంసీలు అనుమతించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు వచ్చినప్పుడు, మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎలా ఎదుర్కొంటాయో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment