ఫొటో స్టిల్ కోసం బాలుడు బలి
సాక్షి, హైదరాబాద్: ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ ఆరాటం... ముక్కుపచ్చలారని బాలుని ప్రాణాలను బలిగొన్న ఉదంతమిది. ఫొటో స్టిల్స్ కోసం యత్నిస్తుండగా బాలుడు చెరువులోపడి మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసు లు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబుబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పల గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మి దంపతులు తమ ముగ్గురు కుమారులు బాల్‌రాజ్, కరుణాకర్, సంజీవ్‌లను తీసుకుని నగరానికి వలస వచ్చారు. పాత బోయిన్‌పల్లి డివిజన్ హస్మత్‌పేట మాలబస్తీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ పిల్లలను స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు బాల్‌రాజ్ స్థానికంగా హాస్టల్‌లో ఉం టుండగా కరుణాకర్, సంజీవ్ ఐదు, మూడో తరగతి చదువుకుంటున్నారు. శుక్రవారం హస్మత్‌పేట చెరువు అంచున పెద్ద ఎత్తున నురగ ఏర్పడటంతో కరుణాకర్, సంజీవ్‌లు ఆడుకుంటున్నారు. అంతలో ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ (‘సాక్షి’ కాదు) వచ్చి నురగను పట్టుకున్నట్లు స్టిల్ ఇస్తే ఫొటోతీసి పత్రికలో వేస్తానని చెప్పారు.
దీంతో వారిద్దరూ హూషారుగా ఒడ్డు నుంచి కొంచెం కిందకు దిగి నురగను పట్టుకుంటున్న సమయంలో కరుణాకర్ (9) అదుపు తప్పి చెరువులో జారి పడ్డాడు. ఆ ఫొటోగ్రాఫర్ వెంటనే చెరువులో దిగి వెతుకులాడినా ఫలితం లేకపోయింది. ప్రవాహ ఉధృతికి బాలుడు కొట్టుకుపోయాడు. సంజీవ్ ఒడ్డుకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఏడ్చుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అల్వాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కరుణాకర్ కోసం గాలింపు చర్యలు చెపట్టారు. మూడు గంటల పాటు గాలించగా అంజయ్యనగర్ అబ్రహాం నగర్ కల్వర్టు వద్ద కరుణాకర్ మృతదేహం లభిం చింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.