ఎంత కష్టమొచ్చిందో..!
పసిపిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
అల్వాల్ : అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన కన్న తల్లే పసి పిల్లలకు పాలల్లో విషమిచ్చి తాను చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...గుంటూరుకు చెందిన సీతారామిరెడ్డి, రాధ (28)లకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కానాజిగూడ తిరుమల్‌నగర్‌లో నివాసముంటున్నారు.
వీరికి నిత్య (2.5ఏళ్లు) యశ్వంత్‌రెడ్డి (11 నెలలు) సంతానం. సీతారాంరెడ్డి ఈసిఐఎల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో అధ్యాపకుడిగా పని చేస్తూ సాయంత్రం వేళల్లో భార్య, భర్తలిద్దరూ ఇంటివద్ద ట్యూషన్‌లు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సీతారాంరెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు మూసి ఉండటంతో ఎన్నిసార్లు పిలిచినా భార్య పలుకకపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో తలుపు తొలగించి లోపలికి వెళ్లి చూడగా, హాలులో మంచంపై ఇద్దరు చిన్నారులు నోటి నుంచి నురుగలు కక్కుతూ మృతి చెంది ఉన్నారు. దీంతో అతను బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా భార్య రాధ చీరతో ఉరి వేసుకుని మృతి చెంది ఉంది.
దీంతో అతను బంధువులు, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలు రాసిన సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘భర్తను వూర్చుకోలేక పోతున్నాను. నేను బతకలేను. నేను చనిపోతే పిల్లలు అనాథలైపోతారు.. అంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. కాగా మధ్యాహ్నం 12.38 నిమిషాలకు రాధ తొందరగా రావాలని తన సెల్‌ఫోన్‌కు మెసెజ్ పంపినట్లు సీతారాంరెడ్డి పోలీసులకు తెలిపాడు. అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్, అల్వాల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ, మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.