Alwal Police Station
-
ఎంత కష్టమొచ్చిందో..!
పసిపిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య అల్వాల్ : అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన కన్న తల్లే పసి పిల్లలకు పాలల్లో విషమిచ్చి తాను చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...గుంటూరుకు చెందిన సీతారామిరెడ్డి, రాధ (28)లకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కానాజిగూడ తిరుమల్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి నిత్య (2.5ఏళ్లు) యశ్వంత్‌రెడ్డి (11 నెలలు) సంతానం. సీతారాంరెడ్డి ఈసిఐఎల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అధ్యాపకుడిగా పని చేస్తూ సాయంత్రం వేళల్లో భార్య, భర్తలిద్దరూ ఇంటివద్ద ట్యూషన్లు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సీతారాంరెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు మూసి ఉండటంతో ఎన్నిసార్లు పిలిచినా భార్య పలుకకపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో తలుపు తొలగించి లోపలికి వెళ్లి చూడగా, హాలులో మంచంపై ఇద్దరు చిన్నారులు నోటి నుంచి నురుగలు కక్కుతూ మృతి చెంది ఉన్నారు. దీంతో అతను బెడ్రూంలోకి వెళ్లి చూడగా భార్య రాధ చీరతో ఉరి వేసుకుని మృతి చెంది ఉంది. దీంతో అతను బంధువులు, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలు రాసిన సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘భర్తను వూర్చుకోలేక పోతున్నాను. నేను బతకలేను. నేను చనిపోతే పిల్లలు అనాథలైపోతారు.. అంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. కాగా మధ్యాహ్నం 12.38 నిమిషాలకు రాధ తొందరగా రావాలని తన సెల్‌ఫోన్‌కు మెసెజ్ పంపినట్లు సీతారాంరెడ్డి పోలీసులకు తెలిపాడు. అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్, అల్వాల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వేధింపుల కేసులో గద్దర్ అల్లుడి అరెస్ట్
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను వేధించిన కేసులో ఆమె భర్త ఎం.రవికుమార్(37)ను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాజీగూడకు చెందిన రవికుమార్ వెన్నెలను 12 సంవత్సరాల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా వెన్నెలను వేధిస్తుండటంతో ఆమె ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు రవికుమార్, అతని సోదరుడు వినోద్‌లను అరెస్ట్ చేసి బుధవారం రిమాండుకు తరలించారు. వెన్నెల ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. -
ఫొటో స్టిల్ కోసం బాలుడు బలి
సాక్షి, హైదరాబాద్: ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ ఆరాటం... ముక్కుపచ్చలారని బాలుని ప్రాణాలను బలిగొన్న ఉదంతమిది. ఫొటో స్టిల్స్ కోసం యత్నిస్తుండగా బాలుడు చెరువులోపడి మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసు లు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబుబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పల గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మి దంపతులు తమ ముగ్గురు కుమారులు బాల్‌రాజ్, కరుణాకర్, సంజీవ్‌లను తీసుకుని నగరానికి వలస వచ్చారు. పాత బోయిన్పల్లి డివిజన్ హస్మత్‌పేట మాలబస్తీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ పిల్లలను స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు బాల్‌రాజ్ స్థానికంగా హాస్టల్లో ఉం టుండగా కరుణాకర్, సంజీవ్ ఐదు, మూడో తరగతి చదువుకుంటున్నారు. శుక్రవారం హస్మత్‌పేట చెరువు అంచున పెద్ద ఎత్తున నురగ ఏర్పడటంతో కరుణాకర్, సంజీవ్‌లు ఆడుకుంటున్నారు. అంతలో ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ (‘సాక్షి’ కాదు) వచ్చి నురగను పట్టుకున్నట్లు స్టిల్ ఇస్తే ఫొటోతీసి పత్రికలో వేస్తానని చెప్పారు. దీంతో వారిద్దరూ హూషారుగా ఒడ్డు నుంచి కొంచెం కిందకు దిగి నురగను పట్టుకుంటున్న సమయంలో కరుణాకర్ (9) అదుపు తప్పి చెరువులో జారి పడ్డాడు. ఆ ఫొటోగ్రాఫర్ వెంటనే చెరువులో దిగి వెతుకులాడినా ఫలితం లేకపోయింది. ప్రవాహ ఉధృతికి బాలుడు కొట్టుకుపోయాడు. సంజీవ్ ఒడ్డుకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఏడ్చుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అల్వాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కరుణాకర్ కోసం గాలింపు చర్యలు చెపట్టారు. మూడు గంటల పాటు గాలించగా అంజయ్యనగర్ అబ్రహాం నగర్ కల్వర్టు వద్ద కరుణాకర్ మృతదేహం లభిం చింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.