సన్యాసినుల వేషంలో వెళ్లి.. జూహీని పట్టేశారు!
సన్యాసినుల వేషంలో వెళ్లి.. జూహీని పట్టేశారు!
Published Thu, Mar 2 2017 1:11 PM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM
పోలీసుల్లో కూడా గొప్ప నటులు ఉంటారు. వాళ్లు అవసరాన్ని బట్టి ఏ వేషమైనా వేయగలరు. ఎంతటి కరడుగట్టిన నేరస్తులనైనా ఇట్టే పట్టేయగలరు. పశ్చిమబెంగాల్ పోలీసులు తాజాగా అలాగే చేశారు. పిల్లల అమ్మకాల రాకెట్‌లో కీలక పాత్రధారి అయిన బీజేపీ మాజీ నాయకురాలు జూహీ చౌదరిని పట్టుకోడానికి కొంతమంది మహిళా పోలీసులు సన్యాసినుల్లా వేషాలు వేసుకున్నారు. కష్టాల్లో ఉన్న జూహీని ఓదార్చడానికి వెళ్లినట్లుగా వెళ్లి, అదాటున రెండు జబ్బలు పట్టేసుకుని బయటకు లాక్కొచ్చారు. ఎత్తుకొచ్చి జీపులో కుదేశారు. భారత్ - నేపాల్ సరిహద్దులకు కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న డార్జిలింగ్ సమీపంలోని ఖైరాబరి అనే ప్రాంతంలో గల ఓ ఇంట్లో ఆమె ఉన్నట్లు సీఐడీ విభాగం గుర్తించింది. పోలీసులు తనను పట్టుకునేలోపే నేపాల్ పారిపోవాలన్నది జూహీ చౌదరి ప్లాన్. చిట్టచివరి నిమిషంలో దాన్ని ఛేదించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వాస్తవానికి తన మీద కేసు నమోదు కాగానే నేపాల్ పారిపోయిన ఆమె.. ఈమధ్యే తిరిగి డార్జిలింగ్ వచ్చారు. పోలీసులు వస్తే ఈసారి కూడా పారిపోదామనే ఆమె అన్నీ సిద్ధం చేసుకున్నారు. పోలీసులు మాత్రం తక్కువ తిన్నారా.. సన్యాసినుల వేషాల్లో వెళ్లి, ముందుగా అక్కడ రెక్కీ చేసి, ఆమె ఉన్న విషయం నిర్ధారించుకుని మరీ దాడి చేశారు. లోపల ఆమె ఉన్న విషయాన్ని రహస్యంగా బయటివాళ్లకు చేరవేశారు. అంతా కలిసి చాకచక్యంగా ఆమెను పట్టుకుని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని జల్పాయిగురి ప్రాంతంలో పిల్లలను అమ్ముకునే రాకెట్‌లో జూహీ చౌదరి కీలకపాత్ర పోషించారు. ఈమె చేసిన నేరాల విషయం తెలియగానే బీజేపీ ఆమె సభ్యత్వాన్ని రద్దుచేసింది. అయినా కూడా ఈమె వ్యవహారం మాత్రం రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చుకు కారణమైంది.
Advertisement