child trafficking racket
-
విశాఖలో కలకలం రేపిన శిశు విక్రయాలు
-
పేగుబంధంతో పైసలాట!
అక్రమార్జనకు రాజమార్గంగా వైద్య వృత్తిని మార్చేసింది కిరాతక డాక్టర్ నమ్రత. పేగుబంధాలను తెంచేసి లక్షలాది రూపాయల సంపాదనే లక్ష్యంగా పసికందులను విక్రయించేసింది. పోలీసులు తవ్వుతున్న కొద్దీ నమ్రత దురాగతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం : సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగషీ ముసుగులో పసికందుల అక్రమ రవాణా, విక్రయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ నమ్రతను మహారాణిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. గురువారం ఆమెను కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చిన్నారి అక్రమ విక్రయం కేసు జూలై 30న నమోదయింది. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సీతమ్మధారలో గల పద్మజ ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి డాక్టర్ నమ్రత దారుణాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మరోవైపు గడిచిన మూడేళ్లలో సృష్టి ఆస్పత్రిలో 63 మంది మహిళలకు సరోగషీ ద్వారా ప్రసవాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా వెల్లడించారు. ఏజెంట్ సాయంతో వలవేసి... విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం పంచాయతీకి చెందిన చందక వెంకటలక్ష్మి చోడవరం మండల కేంద్రంలోని పెద్దబజారులో గల డాక్టర్ జగ్గారావు ఆస్పత్రికి ఈ ఏడాది జనవరిలో పరీక్షల కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సృష్టి ఆస్పత్రి డాక్టర్ నమ్రతకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న నేమాల నూకరత్నం మాటలు కలిపి వెంకటలక్ష్మిని పరిచయం చేసుకుంది. తనతో వస్తే విశాఖపట్నంలో గల సృష్టి ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేయిస్తానని, ఆపరేషన్ అవసరమైనా ఉచితంగానే చేస్తారని నమ్మించింది. దీంతో బాధితురాలు ఆమె మాటలు నమ్మి ఈ ఏడాది జనవరి 30న ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో గల డాక్టర్ నమ్రత, రామకృష్ణ, డాక్టర్ తిరుమల, డాక్టర్ సరోజిని ఆమెను పరీక్షించి డెలివరీ కోసం సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జనవరి 31న డెలివరీ చేసిన వైద్యులు ఆడపిల్ల పుట్టిందని, అయితే చనిపోయిందని చెప్పి నమ్మించారు. బిడ్డ చనిపోయినందుకు సంతాపం ప్రకటించడం తప్ప చేసేదేమీలేదని వెంకటలక్ష్మిని ఆస్పత్రి నుంచి ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేసేశారు. సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రి డాక్టర్ పద్మజ ఇక్కడే తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన వెంకటలక్ష్మి కేస్ షీట్‌ను తారుమారు చేసేసింది. బిడ్డ తల్లి సీహెచ్.వెంకటలక్ష్మి పేరును మార్చివేసి... బిడ్డను అమ్ముతామని ముందుగానే ఒప్పందం చేసుకున్న విజయనగరానికి చెందిన తల్లిదండ్రుల పేరిట కేస్ షీట్‌ను డాక్టర్ పద్మజ తయారు చేసింది. జనన ధ్రువీకరణ పత్రాలు నిమిత్తం జీవీఎంసీకి రిపోర్టులు కూడా పంపించింది. రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకుని... చాలా కాలంగా తమకు పిల్లలు లేరని, ఆధునిక వైద్య పద్ధతుల్లో బిడ్డ పుట్టించాలని విజయనగరానికి చెందిన దంపతులు 2019 ఫిబ్రవరి, మార్చిలో సృష్టి ఆస్పత్రిలో డాక్టర్ పి.నమ్రత, డాక్టర్ తిరుమలను సంప్రదించారు. తమకు చాలా కాలం నుంచి పిల్లలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి సరోగషీ పద్ధతిలో పిల్లలు పుట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని నమ్మించారు. అందుకు మోత్తంగా రూ.13 లక్షల ఖర్చు అవుతుందని వసూలు చేశారు. ప్రణాళికలో భాగంగా వెంకటలక్ష్మిని తీసుకొచ్చాక... ఈ ఏడాది జనవరి 30, 31వ తేదీల్లో ఆస్పత్రికి రావాలని ఆ దంపతులకు చెప్పారు. ఆ ప్రకారం వారు సృష్టి ఆస్పత్రికి రాగా... అక్కడి నుంచి మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లి సరోగషీ పద్ధతిలో ఆడపిల్ల పుట్టిందని చూపించారు. అనంతరం ఫిబ్రవరి 6న బిడ్డను డిశ్చార్జి చేసి అప్పగించారు. (‘సృష్టి’ తీగలాగితే.. వెలుగులోకి ‘పద్మశ్రీ’) బండారం బయటపడిందిలా... ఇటీవల సృష్టి ఆస్పత్రి ఆరాచకాలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసిన బాధితురాలు వెంకటలక్ష్మి అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు పుట్టిన బిడ్డను కూడా డాక్టర్లు అమ్మేశారని, తనకు న్యాయం చేయాలని జూలై 30న ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా బాధితురాలి రక్త నమూనాలు సేకరించి, సృష్టి ఆస్పత్రిలోని నమూనాలతో సరిపోల్చారు. వాటి ఆధారంగా బాధితురాలు వెంకటలక్షి్మని ఈ ఏడాది జనవరి 30న పద్మజ ఆస్పత్రికి డెలివరీ నిమిత్తం పంపినట్లు నిర్ధారించారు. రికార్డుల ప్రకారం 31న సిజేరియన్ చేసి ఆడబిడ్డను తీసినట్లు, అనంతరం మెడికవర్ ఆస్పత్రిలో చేర్చించి ఫిబ్రవరి 6న విజయనగరానికి చెందిన దంపతులకు విక్రయించేసినట్లు నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహరంలో నిందితులైన పద్మజ ఆస్పత్రి డాక్టర్ సీహెచ్.పద్మజ, ఏజెంట్‌గా వ్యవహరించిన నేమాల నూకరత్నంను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ తిరుమలతోపాటు రామకృష్ణ, కోడి వెంకటలక్షి్మ, డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కస్టడీలో నమ్రత వెల్లడించే విషయాలు ఆధారంగా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (వెలుగు చూస్తున్న ‘సృష్టి’ నిర్వాకాలు) -
సృష్టి: వెలుగులోకి ముగ్గురు మహిళా వైద్యులు పాత్ర
సాక్షి, విశాఖపట్నం: సరోగసి ముసుగులో చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు నమ్రతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పలు కీలకాంశాలు తెలిసాయని సీపీ ఆర్కే మీనా తెలిపారు. గత మూడేళ్లలో సృష్టి ఆస్పత్రిలో 63 సరోగసి డెలివరీలు జరిగాయని వెల్లడించారు. చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించి మరిన్ని కేసులు నమోదు అవుతున్నాయన్నారు. తాజాగా ఎంవీపీ పోలీస్ స్టేషన్లో మరో చిన్నారి అక్రమ రవాణా కేసు నమోదయినట్లు తెలిపారు. డాక్టర్ నమ్రత, పద్మజ ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. ఈ క్రమంలో చోడవరానికి చెందిన ఓ మహిళ దగ్గర నుంచి డాక్టర్ నమ్రత 13 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందన్నారు. అంతేకాక మరో గర్బిణీ మహిళ వెంకటలక్ష్మి చోడవరంలోని జగ్గారావు ఆస్పత్రికి చెక్అప్ కోసం వెళ్లారు. ఈ క్రమంలో సృష్టి ఆస్పత్రి ఏజెంట్లు తమ ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేస్తారని ఆమెను నమ్మించారని సీపీ ఆర్కే మీనా తెలిపారు. ఆ తర్వాత సృష్టిలో చేరిన వెంకటలక్ష్మిని డెలివరీ కోసం పద్మజ ఆస్పత్రికి పంపి.. అక్కడే పురుడు పోశారన్నారు. అనంతరం బిడ్డ చనిపోయినట్లుగా ఆమెకు చూపించారన్నారు. ఆ తర్వాత అదే బిడ్డను మరొకరికి సరోగసీ పేరుతో అమ్మేసారని తెలిపారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత, పద్మజలతో పాటు మరో మహిళా డాక్టర్‌తో పాటు ఏజెంట్‌గా వ్యవహరించిన నర్సు నూకరత్నం అరెస్ట్ చేశామన్నారు. సృష్టి ఆస్పత్రిపై అనేక ఆరోపణలున్నాయని లోతుగా విచారిస్తున్నామని సీపీ ఆర్కే మీనా తెలిపారు. -
పిల్లల అక్రమ రవాణా.. ఆస్పత్రి ఎండీ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం ఆదివారం బయటపడింది. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి.. పుట్టిన వెంటనే ఇతరులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు తెలిపారు. (చదవండి: లభించని సింధూజ రెడ్డి ఆచూకీ) ‘పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశాం. విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడైంది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’అని సీపీ పేర్కొన్నారు. గతంలోనూ సృష్టి హాస్పిటల్లో మోసాలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్‌గా పేరు మార్చి చిన్నారుల అక్రమ రవాణాకు తెరతీశారు. (పరువు కోసం కూతుర్ని హతమార్చిన తండ్రి) -
అద్దెకు పాస్‌పోర్టు.. మేకప్‌తో కవర్ చేసి...
సాక్షి, ముంబై : బాలికలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పేద కుటుంబాలకు డబ్బు ఎరగా చూపి బాలికలను అమెరికాకు అమ్మేస్తున్నగుజరాత్‌కు చెందిన రాజుభాయ్ గమ్లేవాలా (50)ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఒక్కో బాలికకు 45 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్న నిందితుడు ఇప్పటి వరకు 300 మంది బాలికలను దేశం దాటించారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు 2007 నుంచి ఈ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వ్యభిచార కూపానికి తరలివెళ్లిన పిల్లలంతా 11 నుంచి 16 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ఇలా దేశం దాటిస్తాడు.. ‘పూట గడవని పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేస్తాడు. కొంచెం అటుఇటూగా అదే పోలికలతో ఉండే వారి పాస్‌పోర్టులు అద్దె ప్రాతిపదికన తీసుకుంటాడు. పాస్‌పోర్టుపై ఉండే ఫోటోకు సరిపోయే విధంగా పిల్లలకు మేకప్ వేయిస్తాడు. అనంతరం దర్జాగా దేశం దాటిస్తాడు. బాలికలను విదేశాలకు తరలించాక తిరిగి ఇండియాకి పాస్‌పోర్టులు పంపిస్తాడు’ అని పోలీసులు వెల్లడించారు. ఇంత జరుగుతున్నా పాస్‌పోర్టు అధికారులకు ఏమాత్రం అనుమానం రాకపోవడం గమనార్హం. ఇలా దొరికిపోయాడు... గత మార్చిలో గుజరాత్‌కు చెందిన నటి ప్రీతిసూద్ చొరవతో ఈ విషయం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలను దేశం దాటించే క్రమంలో వారికి ఒక బ్యూటీ సెలూన్లో మేకప్ వేయించారు. అయితే, మేకప్ విషయంలో బాలికలతో పాటున్న కొందరు వ్యక్తులు అతిగా స్పందించారు. దాంతో సెలూన్ నిర్వాహకుడికి ఈ వ్యవహారంపై అనుమానం వచ్చింది. వెంటనే తన ఫ్రెండ్ ప్రీతికి విషయం చెప్పాడు. అక్కడికి చేరుకున్న ప్రీతి విషయం గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చింది. సెలూన్‌పై దాడి చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. తాజాగా.. అక్రమ రవాణా రాకెట్లో కీలక వ్యక్తి గమ్లేవాలాను సైతం అరెస్తు చేశారు. కాగా, అరెస్టయిన వారిలో ఒకరు ఎస్సై కొడుకు కావడం గమనార్హం. -
సన్యాసినుల వేషంలో వెళ్లి.. జూహీని పట్టేశారు!
పోలీసుల్లో కూడా గొప్ప నటులు ఉంటారు. వాళ్లు అవసరాన్ని బట్టి ఏ వేషమైనా వేయగలరు. ఎంతటి కరడుగట్టిన నేరస్తులనైనా ఇట్టే పట్టేయగలరు. పశ్చిమబెంగాల్ పోలీసులు తాజాగా అలాగే చేశారు. పిల్లల అమ్మకాల రాకెట్లో కీలక పాత్రధారి అయిన బీజేపీ మాజీ నాయకురాలు జూహీ చౌదరిని పట్టుకోడానికి కొంతమంది మహిళా పోలీసులు సన్యాసినుల్లా వేషాలు వేసుకున్నారు. కష్టాల్లో ఉన్న జూహీని ఓదార్చడానికి వెళ్లినట్లుగా వెళ్లి, అదాటున రెండు జబ్బలు పట్టేసుకుని బయటకు లాక్కొచ్చారు. ఎత్తుకొచ్చి జీపులో కుదేశారు. భారత్ - నేపాల్ సరిహద్దులకు కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న డార్జిలింగ్ సమీపంలోని ఖైరాబరి అనే ప్రాంతంలో గల ఓ ఇంట్లో ఆమె ఉన్నట్లు సీఐడీ విభాగం గుర్తించింది. పోలీసులు తనను పట్టుకునేలోపే నేపాల్ పారిపోవాలన్నది జూహీ చౌదరి ప్లాన్. చిట్టచివరి నిమిషంలో దాన్ని ఛేదించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి తన మీద కేసు నమోదు కాగానే నేపాల్ పారిపోయిన ఆమె.. ఈమధ్యే తిరిగి డార్జిలింగ్ వచ్చారు. పోలీసులు వస్తే ఈసారి కూడా పారిపోదామనే ఆమె అన్నీ సిద్ధం చేసుకున్నారు. పోలీసులు మాత్రం తక్కువ తిన్నారా.. సన్యాసినుల వేషాల్లో వెళ్లి, ముందుగా అక్కడ రెక్కీ చేసి, ఆమె ఉన్న విషయం నిర్ధారించుకుని మరీ దాడి చేశారు. లోపల ఆమె ఉన్న విషయాన్ని రహస్యంగా బయటివాళ్లకు చేరవేశారు. అంతా కలిసి చాకచక్యంగా ఆమెను పట్టుకుని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి ప్రాంతంలో పిల్లలను అమ్ముకునే రాకెట్లో జూహీ చౌదరి కీలకపాత్ర పోషించారు. ఈమె చేసిన నేరాల విషయం తెలియగానే బీజేపీ ఆమె సభ్యత్వాన్ని రద్దుచేసింది. అయినా కూడా ఈమె వ్యవహారం మాత్రం రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చుకు కారణమైంది.