విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీపీ రాజీవ్‌కుమార్ మీనా
అక్రమార్జనకు రాజమార్గంగా వైద్య వృత్తిని మార్చేసింది కిరాతక డాక్టర్ నమ్రత. పేగుబంధాలను తెంచేసి లక్షలాది రూపాయల సంపాదనే లక్ష్యంగా పసికందులను విక్రయించేసింది. పోలీసులు తవ్వుతున్న కొద్దీ నమ్రత దురాగతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం : సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగషీ ముసుగులో పసికందుల అక్రమ రవాణా, విక్రయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ నమ్రతను మహారాణిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. గురువారం ఆమెను కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చిన్నారి అక్రమ విక్రయం కేసు జూలై 30న నమోదయింది. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సీతమ్మధారలో గల పద్మజ ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి డాక్టర్ నమ్రత దారుణాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మరోవైపు గడిచిన మూడేళ్లలో సృష్టి ఆస్పత్రిలో 63 మంది మహిళలకు సరోగషీ ద్వారా ప్రసవాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా వెల్లడించారు.
ఏజెంట్ సాయంతో వలవేసి...
విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం పంచాయతీకి చెందిన చందక వెంకటలక్ష్మి చోడవరం మండల కేంద్రంలోని పెద్దబజారులో గల డాక్టర్ జగ్గారావు ఆస్పత్రికి ఈ ఏడాది జనవరిలో పరీక్షల కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సృష్టి ఆస్పత్రి డాక్టర్ నమ్రతకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న నేమాల నూకరత్నం మాటలు కలిపి వెంకటలక్ష్మిని పరిచయం చేసుకుంది. తనతో వస్తే విశాఖపట్నంలో గల సృష్టి ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేయిస్తానని, ఆపరేషన్ అవసరమైనా ఉచితంగానే చేస్తారని నమ్మించింది. దీంతో బాధితురాలు ఆమె మాటలు నమ్మి ఈ ఏడాది జనవరి 30న ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో గల డాక్టర్ నమ్రత, రామకృష్ణ, డాక్టర్ తిరుమల, డాక్టర్ సరోజిని ఆమెను పరీక్షించి డెలివరీ కోసం సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ జనవరి 31న డెలివరీ చేసిన వైద్యులు ఆడపిల్ల పుట్టిందని, అయితే చనిపోయిందని చెప్పి నమ్మించారు. బిడ్డ చనిపోయినందుకు సంతాపం ప్రకటించడం తప్ప చేసేదేమీలేదని వెంకటలక్ష్మిని ఆస్పత్రి నుంచి ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేసేశారు. సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రి డాక్టర్ పద్మజ ఇక్కడే తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన వెంకటలక్ష్మి కేస్ షీట్‌ను తారుమారు చేసేసింది. బిడ్డ తల్లి సీహెచ్.వెంకటలక్ష్మి పేరును మార్చివేసి... బిడ్డను అమ్ముతామని ముందుగానే ఒప్పందం చేసుకున్న విజయనగరానికి చెందిన తల్లిదండ్రుల పేరిట కేస్ షీట్‌ను డాక్టర్ పద్మజ తయారు చేసింది. జనన ధ్రువీకరణ పత్రాలు నిమిత్తం జీవీఎంసీకి రిపోర్టులు కూడా పంపించింది.
రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకుని...
చాలా కాలంగా తమకు పిల్లలు లేరని, ఆధునిక వైద్య పద్ధతుల్లో బిడ్డ పుట్టించాలని విజయనగరానికి చెందిన దంపతులు 2019 ఫిబ్రవరి, మార్చిలో సృష్టి ఆస్పత్రిలో డాక్టర్ పి.నమ్రత, డాక్టర్ తిరుమలను సంప్రదించారు. తమకు చాలా కాలం నుంచి పిల్లలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి సరోగషీ పద్ధతిలో పిల్లలు పుట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని నమ్మించారు. అందుకు మోత్తంగా రూ.13 లక్షల ఖర్చు అవుతుందని వసూలు చేశారు. ప్రణాళికలో భాగంగా వెంకటలక్ష్మిని తీసుకొచ్చాక... ఈ ఏడాది జనవరి 30, 31వ తేదీల్లో ఆస్పత్రికి రావాలని ఆ దంపతులకు చెప్పారు. ఆ ప్రకారం వారు సృష్టి ఆస్పత్రికి రాగా... అక్కడి నుంచి మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లి సరోగషీ పద్ధతిలో ఆడపిల్ల పుట్టిందని చూపించారు. అనంతరం ఫిబ్రవరి 6న బిడ్డను డిశ్చార్జి చేసి అప్పగించారు. (‘సృష్టి’ తీగలాగితే.. వెలుగులోకి ‘పద్మశ్రీ’)
బండారం బయటపడిందిలా...
ఇటీవల సృష్టి ఆస్పత్రి ఆరాచకాలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసిన బాధితురాలు వెంకటలక్ష్మి అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు పుట్టిన బిడ్డను కూడా డాక్టర్లు అమ్మేశారని, తనకు న్యాయం చేయాలని జూలై 30న ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా బాధితురాలి రక్త నమూనాలు సేకరించి, సృష్టి ఆస్పత్రిలోని నమూనాలతో సరిపోల్చారు. వాటి ఆధారంగా బాధితురాలు వెంకటలక్షి్మని ఈ ఏడాది జనవరి 30న పద్మజ ఆస్పత్రికి డెలివరీ నిమిత్తం పంపినట్లు నిర్ధారించారు. రికార్డుల ప్రకారం 31న సిజేరియన్ చేసి ఆడబిడ్డను తీసినట్లు, అనంతరం మెడికవర్ ఆస్పత్రిలో చేర్చించి ఫిబ్రవరి 6న విజయనగరానికి చెందిన దంపతులకు విక్రయించేసినట్లు నిర్ధారించారు.
ఈ మొత్తం వ్యవహరంలో నిందితులైన పద్మజ ఆస్పత్రి డాక్టర్ సీహెచ్.పద్మజ, ఏజెంట్‌గా వ్యవహరించిన నేమాల నూకరత్నంను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ తిరుమలతోపాటు రామకృష్ణ, కోడి వెంకటలక్షి్మ, డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కస్టడీలో నమ్రత వెల్లడించే విషయాలు ఆధారంగా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (వెలుగు చూస్తున్న ‘సృష్టి’ నిర్వాకాలు)
Comments
Please login to add a commentAdd a comment