ఛత్తీస్‌లో తొలి పోరు నేడే | Polling begins in Chhattisgarh today | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌లో తొలి పోరు నేడే

Published Mon, Nov 11 2013 1:31 AM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

ఛత్తీస్‌లో తొలి పోరు నేడే - Sakshi

ఛత్తీస్‌లో తొలి పోరు నేడే

 సాక్షి, జగదల్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఆయన  కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు సహా 143 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే శాసనసభ తొలివిడత ఎన్నికలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. నక్సల్ అత్యంత ప్రభావిత ప్రాంతాల్లోని 18 శాసనసభ నియోజకవర్గాల్లో 19.55 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 90 స్థానాలు గల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండు విడతల్లో (నవంబర్ 11, 19 తేదీల్లో) పోలింగ్ జరగనుంది. ఆరు నెలల క్రితం బస్తర్ ప్రాంతంలో జరిగిన నక్సల్ దాడిలో కాంగ్రెస్ నాయకులు నందకుమార్ పటేల్, మహేంద్ర కర్మ, ఉదయ్ ముదలియార్, విద్యాచరణ్ శుక్లా సహా 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.
 
 అలాగే ఈ ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పాటు ఆదివారం ఒక పోలింగ్ కేంద్రం వద్ద మందుపాతర పేల్చిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ముందుగా అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. రాష్ట్రమంతటా భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ప్రస్తుతం నక్సల్ నిరోధక కార్యకలాపాల్లో ఉన్న 40 బెటాలియన్ల పారామిలిటరీ (40 వేల మంది) దళాలకు తోడు మొత్తం 462 కంపెనీల (46,200 మంది) బలగాలను కేంద్రం నుంచి రప్పించారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో డేగకన్నుతో తనిఖీలు చేపట్టారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగుస్తుందని రాష్ట్ర డీజీపీ రామ్ నివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ, ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలేవీ చోటుచేసుకోకుండా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసుశాఖ పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు.
 
 పొంచి ఉన్న మావోయిస్టులు
 ఎన్నికల్లో మావోయిస్టులు భారీ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలోని నారాయణపూర్, బీజాపూర్, ఎర్రబోరు, చింతల్‌నార్, దర్భాఘాట్, జేగురుగొండ, నేషనల్‌పార్క్ తదితర ప్రాంతాల్లో మావోయిస్టులు పొంచి ఉన్నారని రాయ్‌పూర్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు ధ్రువీకరించారు.పోలీసులు ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మావోయిస్టులు దాడులకు దిగుతున్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు బస్తర్ డివిజన్‌లో అధికంగా ఉన్నాయి. వాహనాలను మావోలు అడ్డుకొనే అవకాశం ఉన్నందున హెలికాప్టర్లలో సిబ్బందిని, ఈవీఎంలను తరలించారు.
 
 రమణ్‌సింగ్ సర్కార్‌కు హ్యాట్రిక్ దక్కేనా?
 కాంగ్రెస్‌పై వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించాలని రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తహతహలాడుతోంది. రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో రమణ్‌సింగ్‌కు పోటీగా కాంగ్రెస్ నాయకుడు దివంగత ఉదయ్ ముదలియార్ సతీమణి అల్కా ముదలియార్ బరిలో ఉన్నారు. గత ఎన్నికలలో ఉదయ్ ముదలియార్‌పై రమణ్‌సింగ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు దంతెవాడ (ఎస్టీ రిజర్వ్‌డ్) నియోజకవర్గంలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, దివంగత మహేంద్ర కర్మ సతీమణి దేవతి కర్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఒకవైపు మావోయిస్టుల భయం అభ్యర్థులను వెన్నాడుతుంటే మరోవైపు రెబెల్స్ కూడా వారికి దడ తెప్పిస్తున్నారు. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు గిరిజనుల మద్దతుతో స్వాభిమాన్‌మంచ్ కూడా ఈ రెండు పార్టీలకు గట్టి పోటీనిస్తుండడంతో సమరం రసవత్తరంగా మారింది.
 
 మందుపాతర పేలి జవాన్లకు గాయాలు
 ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు లక్ష్యంగా ఆదివారం నక్సలైట్లు మందుపాతర పేల్చారు. రాజనంద్‌గావ్ జిల్లా, బల్దొం గ్రి గ్రామం దగ్గరలో తక్కువ శక్తి కలిగిన మందుపాతరను పేల్చడంతో ఇద్దరు ఇండో టిబెటన్ సరిహద్దు దళ పోలీసులు గాయపడ్డారు. అలాగే, భద్రతాదళాలు లక్ష్యంగా బస్తర్ ప్రాంతంలో రహదారులపై ఏర్పాటుచేసిన పలు మందుపాతరలను పోలీసులు ఆదివారం వెలికితీసి, నిర్వీర్యం చేశారు. వాటిలో 35 కేజీల పైప్ బాంబ్, ఒక్కొక్కటి 2 కేజీలున్న ఐదు చిన్నస్థాయి మందుపాతరలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement