'ప్రేమమ్' పైరసీ కేసులో కొత్త ట్విస్ట్
తిరువనంతపురం: మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' పైరసీ కేసు కీలక మలుపు తిరిగింది. సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమాను పైరసీ చేసినట్టు కేరళ పోలీసులు గుర్తించారు. పైరసీకి పాల్పడ్డారన్న ఆరోపణలతో ముగ్గురు సెన్సార్ బోర్డులో పనిచేస్తున్న ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి పాత్ర ఉందనియ పోలీసులు శాస్త్రీయంగా నిర్ధారించుకున్నారు.
మే నెల చివరి వారంలో విడుదలైన 'ప్రేమమ్' రికార్డులన్నింటినీ తిరగరాసింది. విడుదలైన కొద్ది రోజులకే సెన్సార్ బోర్డు వాటర్ మార్కుతో ఈ సినిమా ఇంటర్నెట్ లో రావడంతో కలకలం రేగింది. పైరసీపై అన్నివైపుల నుంచి ఆందోళన పెరగడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.
'ప్రేమమ్' పైరసీ వెనుక సెన్సార్ బోర్డు సిబ్బంది హస్తం ఉందని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అందరి కంటే ముందు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తన స్టూడియోలో జరగడంతో ఆయనపైనా ఆరోపణలు వచ్చాయి. ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ముగ్గురు స్కూల్ విద్యార్థులను అంతకుముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశముంది.