ట్రంప్, క్లింటన్ ల మధ్య భేదం అదే: ఒబామా
వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ తరఫు నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల తరఫు నుంచి పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ల మధ్య భవిష్యత్తు, ఊహలకు ఉన్న తేడా ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నార్త్ కరోలినాలో తొలిసారి హిల్లరీ తరఫు ప్రచారం నిర్వహించిన ఆయన చార్లెట్టేలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో ప్రతి పౌరునికి భవిష్యత్తుకు ఓటు వేసే అవకాశం ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఒబామా పిలుపునిచ్చారు. కేవలం డెమొక్రటిక్ పార్టీకో లేదా రిపబ్లికన్ పార్టీకో సంబంధించిన అంశం కాదని దేశ భవిష్యత్తు కోసం మీరు తీసుకోబోతున్న నిర్ణయమని ఆయన అభివర్ణించారు. క్లింటన్ పై ఎఫ్బీఐ చార్జ్ షీటు దాఖలు చేయడంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయని ఒబామా, క్లింటన్ కు ఉన్న అనుభవాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు.
హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారని ఒబామా అన్నారు. భవిష్యత్తును గురించి భయపడే నాయకురాలు హిల్లరీ కాదని, మనం తయారు చేసుకునే విధానాలను బట్టే భవిష్యత్తు ఉంటుందని నమ్ముతారని ఆయన అన్నారు. దేశ ఆర్ధికవ్యవస్థ పనితీరుపై హిల్లరీ క్లింటన్ కు నిశిత అవగాహన ఉందని ఆయన చెప్పారు. ట్రంప్ పేరును ఉపయోగించకుండా విమర్శించిన ఒబామా, మాటలతో ఊదరగొట్టే నాయకుల కన్నా హిల్లరీ సమర్ధవంతంగా దేశాన్ని రక్షిస్తారని అన్నారు.