భయాన్ని కాదు.. ఆశను ఎంచుకోండి
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి కీలకంగా భావిస్తున్న నార్త్ కరోలినాలో శుక్రవారం పర్యటించిన బరాక్ ఒబామా.. ట్రంప్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి సపోర్ట్‌గా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. భయాన్ని కాకుండా ఆశను ఎన్నుకొమ్మని ఓటర్లకు సూచించారు. 'అమెరికా పౌరులు పాటించే విలువలను ట్రంప్ గౌరవించలేదు కాబట్టి అమెరికా అత్యున్నత స్థానానికి అతడు అనర్హుడు' అని ఒబామా విమర్శించారు.
ఫయటెవిల్లె స్టేట్ యూనివర్సిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒబామా 'ఒకవేళ అమెరికన్లు స్ట్రాంగ్ అని మీరు భావించినట్లైతే.. అమెరికన్లను వికలాంగులు అని, వలసదారులను క్రిమినల్స్, రేపిస్టులు అని, అలాగే మైనారిటీలను అవమానించేలా వ్యాఖ్యానించిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు' అని అన్నారు. అలాగే.. మహిళలను పందులు, కుక్కలు అంటూ మాట్లాడిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు అంటూ ఓటర్లను ఒబామా కోరారు.