నాకంటే.. బిల్‌కంటే.. హిల్లరీనే బెస్ట్!
అమెరికా అధ్యక్ష పదవికి ఆమెకే అర్హతలు ఎక్కువ
* హిల్లరీపై ఒబామా ప్రశంసల జల్లు
* పార్టీ కన్వెన్షన్‌లో ఉద్వేగపూరిత ప్రసంగం
ఫిలడెల్ఫియా: ‘‘నేను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా.. నాకంటే.. బిల్‌కంటే.. మరెవరికంటే కూడా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి హిల్లరీకే అర్హతలు ఎక్కువ. ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా. ఇకపై నా పనిని ఓ సాధారణ పౌరునిగా చేస్తా. ఇక మనం చేయగలిగే మంచి పని ఏమిటంటే.. దేశ తదుపరి అధ్యక్షురాలిగా హిల్లరీని ఎన్నుకోవడమే’’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికన్లకు పిలుపునిచ్చారు.
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైన నేపథ్యంలో పార్టీ కన్వెన్షన్ మూడో రోజు ఒబామా డెలిగేట్లను, ప్రతినిధులను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీపై ఒబామా ప్రశంసలు కురిపించారు. హిల్లరీకి అధ్యక్ష భవనంలో ఏం జరుగుతుందో పూర్తి అవగాహన ఉందని, కానీ రిపబ్లికన్ అభ్యర్థి రాజకీయ నాయకుడు కాదని, ఆయనకు ఇలాంటి వాటిపై అవగాహన లేదని ఒబామా పేర్కొన్నారు. ‘‘ఓవల్ ఆఫీసుకు ఏం కావాలో మనకు ముందుగా తెలియదు. ఒకసారి మనం ఆ డెస్క్‌పై కుర్చున్న తర్వాతే అది అర్థమవుతుంది. ప్రపంచ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి..? యువకులను యుద్ధానికి పంపాలా..? వంటి అంశాల గురించి మనకు ఏమీ తెలీదు.
కానీ హిల్లరీ ఆ రూమ్‌లో ఉంటే మనకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. ఇలాంటి నిర్ణయాల్లో ఇప్పటికే ఆమె పాలుపంచుకున్నారు. ఆయన(ట్రంప్)కి సరైన ప్రణాళిక అనేది లేదు. ఆయన వాస్తవవాది కాదు. తనది వ్యాపార మనస్తత్వం అని స్వయంగా ఆయన చెప్పుకుంటారు. అది మాత్రం ముమ్మాటికీ నిజం’’ అని పేర్కొన్నారు. రెండు సార్లు అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన తాను ఇప్పుడు మీ ముందుకు వచ్చానని, సురక్షితమైన చేతుల్లో అమెరికాను పెడుతున్నానని నమ్మకంగా చెప్పగలనన్నారు. ఒబామా ప్రసంగం చివరిలో హిల్లరీ స్టేజిపైకి రావడంతో సదస్సు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. వేదికపై హిల్లరీని ఆలింగనం చేసుకున్న ఒబామా.. తన మాదిరిగానే హిల్లరీని కూడా ఆదరించాలని కోరారు.
మెరిసిన భారతీయ అమెరికన్లు: సదస్సు వేదికపై ముగ్గురు భారతీయ-అమెరికన్లు మెరిశారు. ఈ సందర్భంగా నీరా టాండెన్(45) తన రాజకీయ అరంగేట్రం చేశారు. ఇల్లినాయి నుంచి కాంగ్రెస్ డెమొక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి(42)ని పార్టీలో ప్రాధాన్యం పొందుతున్న నేతగా పరిచయం చేశారు. భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమి బెరా మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రస్తుత సంక్లిష్టతను అర్థం చేసుకున్న ఒకే ఒక అభ్యర్థిగా హిల్లరీని సమర్థిస్తున్నానన్నారు.