Democratic convention
-
నాకంటే.. బిల్‌కంటే.. హిల్లరీనే బెస్ట్!
అమెరికా అధ్యక్ష పదవికి ఆమెకే అర్హతలు ఎక్కువ * హిల్లరీపై ఒబామా ప్రశంసల జల్లు * పార్టీ కన్వెన్షన్‌లో ఉద్వేగపూరిత ప్రసంగం ఫిలడెల్ఫియా: ‘‘నేను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా.. నాకంటే.. బిల్‌కంటే.. మరెవరికంటే కూడా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి హిల్లరీకే అర్హతలు ఎక్కువ. ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా. ఇకపై నా పనిని ఓ సాధారణ పౌరునిగా చేస్తా. ఇక మనం చేయగలిగే మంచి పని ఏమిటంటే.. దేశ తదుపరి అధ్యక్షురాలిగా హిల్లరీని ఎన్నుకోవడమే’’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికన్లకు పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైన నేపథ్యంలో పార్టీ కన్వెన్షన్ మూడో రోజు ఒబామా డెలిగేట్లను, ప్రతినిధులను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీపై ఒబామా ప్రశంసలు కురిపించారు. హిల్లరీకి అధ్యక్ష భవనంలో ఏం జరుగుతుందో పూర్తి అవగాహన ఉందని, కానీ రిపబ్లికన్ అభ్యర్థి రాజకీయ నాయకుడు కాదని, ఆయనకు ఇలాంటి వాటిపై అవగాహన లేదని ఒబామా పేర్కొన్నారు. ‘‘ఓవల్ ఆఫీసుకు ఏం కావాలో మనకు ముందుగా తెలియదు. ఒకసారి మనం ఆ డెస్క్‌పై కుర్చున్న తర్వాతే అది అర్థమవుతుంది. ప్రపంచ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి..? యువకులను యుద్ధానికి పంపాలా..? వంటి అంశాల గురించి మనకు ఏమీ తెలీదు. కానీ హిల్లరీ ఆ రూమ్‌లో ఉంటే మనకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. ఇలాంటి నిర్ణయాల్లో ఇప్పటికే ఆమె పాలుపంచుకున్నారు. ఆయన(ట్రంప్)కి సరైన ప్రణాళిక అనేది లేదు. ఆయన వాస్తవవాది కాదు. తనది వ్యాపార మనస్తత్వం అని స్వయంగా ఆయన చెప్పుకుంటారు. అది మాత్రం ముమ్మాటికీ నిజం’’ అని పేర్కొన్నారు. రెండు సార్లు అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన తాను ఇప్పుడు మీ ముందుకు వచ్చానని, సురక్షితమైన చేతుల్లో అమెరికాను పెడుతున్నానని నమ్మకంగా చెప్పగలనన్నారు. ఒబామా ప్రసంగం చివరిలో హిల్లరీ స్టేజిపైకి రావడంతో సదస్సు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. వేదికపై హిల్లరీని ఆలింగనం చేసుకున్న ఒబామా.. తన మాదిరిగానే హిల్లరీని కూడా ఆదరించాలని కోరారు. మెరిసిన భారతీయ అమెరికన్లు: సదస్సు వేదికపై ముగ్గురు భారతీయ-అమెరికన్లు మెరిశారు. ఈ సందర్భంగా నీరా టాండెన్(45) తన రాజకీయ అరంగేట్రం చేశారు. ఇల్లినాయి నుంచి కాంగ్రెస్ డెమొక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి(42)ని పార్టీలో ప్రాధాన్యం పొందుతున్న నేతగా పరిచయం చేశారు. భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమి బెరా మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రస్తుత సంక్లిష్టతను అర్థం చేసుకున్న ఒకే ఒక అభ్యర్థిగా హిల్లరీని సమర్థిస్తున్నానన్నారు. -
ఆయన అమెరికాను అడ్డంగా అమ్మేస్తాడు!
ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సొంత పార్టీ డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. 12 ఏళ్ల కిందట ఇదే వేదికపై అధ్యక్ష అభ్యర్థిగా ప్రసంగించిన ఒబామా.. ప్రస్తుతం రెండు పర్యాయలు పూర్తిచేస్తుకున్న శ్వేతసౌధం అధిపతిగా మాట్లాడుతూ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా, బిల్ క్లింటన్ కన్నా హిల్లరీ ఎక్కువ అర్హురాలని, ఆమెను ఎంతమంది దెబ్బతీయాలని చూసినా, ఆమె ఎప్పుడు వెనుకడుగు వేయబోదని, వెన్నుచూపి తప్పుకోబోదని పేర్కొన్నారు. ఇంకా తన ప్రసంగంలో ఒబామా ఏమన్నారంటే.. నేను రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను. అమెరికా భవిష్యత్తు పట్ల ఎప్పుడూ లేనంత ఆశాభావంతో ఉన్నాను. ఎన్నో ప్రమాణాల ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు మన దేశం ఎంతో శక్తిమంతంగా, సమృద్ధిగా ఉంది. గతవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన రిపబ్లికన్ సదస్సులోని వ్యాఖ్యలు మనం విన్నాం. ఇవి ఎంతమాత్రం కన్జర్వేటివ్ అభిప్రాయాలు కావు. దేశ భవిష్యత్తు గురించి ఎంతో నిరాశాపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పి ప్రపంచం నుంచి అమెరికాను వేరే చేసేలా మాట్లాడారు. ఇది నిజమైన రిపబ్లికన్ పార్టీయేనా అనిపించింది. అమెరికా ఇప్పటికే గొప్ప దేశం. శక్తిమంతమైన దేశం. మన గొప్పతనం కోసం ట్రంప్‌పై ఆధారపడాల్సిన ఖర్మ పట్టలేదు. తన సంకుచిత భావజాలంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను అమ్మేయగలడు. కానీ, మనం అంత బలహీనులం. భయస్తులం కాము. ఈ నేలమీద డొనాల్డ్ ట్రంప్ 70 ఏళ్లు బతికాడు. కానీ ఎన్నడూ ఆయన కార్మికులను గౌరవించిన పాపాన పోలేదు. ఎనిమిదేళ్ల కిందట అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం నేను-హిల్లరీ ప్రత్యర్థులుగా పోరాడం. ఆ పోరు చాలా కఠినంగా కొనసాగింది. ఎందుకంటే హిల్లరీ అంత దృఢమైన వ్యక్తి. ఐఎస్ఐఎస్ను తుదముట్టించేవరకు హిల్లరీ విశ్రమించబోదు. ఆమె తదుపరి కమాండర్ ఇన్ చీఫ్ పదవి చేపట్టేందుకు సైతం ఫిట్‌గా ఉంది. మన పిల్లల భవిష్యత్తును ఆమె కాపాడగలదు. మన పిల్లలు, భావితరాలను కాపాడుకునేందుకు తుపాకీ సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరముంది. -
ఆమె నా బెస్ట్ ఫ్రెండ్.. ఆమెను పెళ్లాడాక..!
ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య , హిల్లరీ క్లింటన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె తన బెస్ట్‌ఫ్రెండ్ అని, 1971 వసంతకాలంలో ఆమెను చూడగానే తాను ప్రేమలో పడిపోయినట్టు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీకి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఫిలడెల్ఫియాలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. తమ దాంపత్య జీవితంలోని ఎన్నో విషయాలను స్పృశిస్తూనే.. ఆమెను అమెరికా అధ్యక్షురాలిగా ఎందుకు ఎన్నుకోవాలో వివరించారు.. ఆ వివరాలివి.. 1971లో వసంతకాలంలో హిల్లరీనితొలిసారి కలిశాను. చూడగానే ఆమెతో ప్రేమలో పడ్డాను. బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆమెను పెళ్లాడాను. ఆమె చూపే తెలివితేటలు, శక్తిమంతమైన వ్యక్తిత్వం, ప్రేమ, శ్రద్ధ ఇప్పటికీ నన్ను విస్మయపరుస్తుఘుంటాయి. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత నేను సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను. ప్రజాసేవ గురించి నా కళ్లు తెరిపించి నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి నడిపించింది హిల్లరీనే. ఒసామా బిన్ లాడెన్‌ను గాలించడంలో అధ్యక్షుడు ఒబామాకు హిల్లరీ ఎప్పుడూ అండగా నిలిచింది. మీరు యువ ఆఫ్రికన్-అమెరికన్ అయితే ఆరుబయట స్వేచ్ఛగా నడిచేందుకు ఎవరూ భయపడని భవిష్యత్తును నిర్మించుకునేందుకు హిల్లరీకి అండగా నిలువండి. మీరు ముస్లిం అయితే, అమెరికాను, స్వేచ్ఛను ప్రేమిస్తే.. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తే.. ఇక్కడే ఉండండి. మేం గెలిచేందుకు అండగా నిలువండి. హిల్లరీ మార్పుసాధకురాలు. ఆమె ఎప్పుడూ యథాతథ స్థితిని అంగీకరించదు. భూగోళంపై అత్యంత గొప్ప దేశం మనది. మనం ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించాలి. మీరు హిల్లరీని ఎందుకు ఎన్నుకోవాలంటే ఆమె మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది కాబట్టి. హిల్లరీకి ప్రత్యర్థిగా పోటీలోకి దిగింది ఓ కార్టూన్ (ట్రంప్) మాత్రమే.