హిల్లరీ నామినేషన్ లాంఛనమే!
- కాలిఫోర్నియా, న్యూజెర్సీలో స్పష్టమైన మెజారిటీ
- జూలై 25న అధికారిక ప్రకటన..
లాస్ ఏంజిలస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ (68) రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియా, న్యూజెర్సీతోపాటు మరో నాలుగు చిన్న రాష్ట్రాలకు జరిగిన ప్రైమరీల్లో నాలుగింటిలో గెలిచి.. డెమొక్రాట్ల తరపున అధ్యక్ష బరిలో నిలిచేందుకు అధికారికంగా అర్హత సాధించారు. చివరి పోరుకు అర్హత సాధించేందుకు అవసరమైన 2,383 డెలిగేట్ల మద్దతును హిల్లరీ సాధించారు. మంగళవారం నాటి ఎన్నికల తర్వాత హిల్లరీకి 2,755 డెలిగేట్ల మద్దతు లభించగా.. శాండర్స్‌కు 1,852 మంది బాసట పలికారు.
అయితే ఇందులో సూపర్ డెలిగేట్ల సంఖ్యను కూడా కలిపారు. అయితే ఓటమిని అంగీకరించేది లేదని వచ్చే మంగళవారం వాషింగ్టన్ డీసీలో జరిగే చివరి ప్రైమరీ వరకు బరిలో ఉంటానని శాండర్స్ ప్రకటించారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేషన్ సాధించిన హిల్లరీని అధ్యక్షుడు ఒబామా అభినందించారు. ఆయన గురువారం హిల్లరీ, శాండర్స్‌తో భేటీ కానున్నారు. జూలై 25 నుంచి 28 మధ్యన ఫిలడెల్ఫియాలో జరిగే డెమొక్రాటిక్ కన్వెన్షన్‌లో అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. కాగా, శాండర్స్ అభ్యర్థిత్వాన్ని కోరుకున్న వారంతా బాధపడొద్దని.. తనకు మద్దతు తెలపాలని ట్రంప్ కోరారు.