మార్కెటింగ్‌లో మనంపూర్: రాహుల్ గాంధీ
సాక్షి, బెంగళూరు: ‘‘మనం ఎక్కువగా పనిచేస్తాం. కానీ మార్కెటింగ్ బాగా చేసుకోలేం. ప్రతిపక్షం మాత్రం తక్కువగా పనిచేస్తుంది. ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుంటుంది’’ అని కాంగ్రెస్ కార్యకర్తలతో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారమిక్కడ ‘యువత, విద్యార్థుల మేనిఫెస్టో రూపకల్పనకు సంప్రదింపుల సమాలోచనం’ పేరుతో పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు, ఉద్యోగులు, పంచాయతీ ప్రతినిధులు, ఇతర వర్గాలకు చెందిన 250 మంది యువ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజకీయాల్లో ప్రవేశాలు పారదర్శకంగా లేకపోవడంతో యువతకు ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరుండాలని ప్రజలను అడుగుతుందా? అని ప్రశ్నించారు. మన ఉన్నత విద్యా విధానాన్ని పారిశ్రామిక రంగం, ఎన్‌జీఓ, ఇతర రంగాలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంద న్నారు. మహిళలకు సరైన అధికారాలు లేకపోవడమే వారిపై వేధింపులకు కారణమని విశ్లేషిస్తూ.. మహిళా సాధికారతే వారి సమస్యలకు పరిష్కారమని తెలిపారు.