‘రాహుల్ బ్లూప్రింట్’తో కాంగ్రెస్‌కు పునరుత్తేజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు పునరుత్తేజం కల్పించే బ్లూప్రింట్ రాహుల్ గాంధీ వద్ద ఉందని, వచ్చే రెండు నెలల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. రాజకీయాల నుంచి రెండు నెలల విరామం తీసుకొని వచ్చిన ఉపాధ్యక్షుడు రాహుల్‌ను సింధియా సమర్థించారు.
‘ఆయన మనసులో బ్లూప్రింట్ ఉంది. రానున్న 1-2 నెలల్లో మార్పును మీరే చూస్తారు’ అని చెప్పారు. రాహుల్ సుదీర్ఘ విరామం తీసుకున్నప్పుడు.. పార్టీకి జవసత్వాలు కల్పించే బ్లూప్రింట్‌తో ఆయన తిరిగొస్తాడన్న పార్టీ నాయకుల మాటల గురించి ప్రస్తావించగా సింధియా పైవిధంగా స్పందించారు. ఒక టీవీ చానెల్ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో సింధియా మాట్లాడారు.
వివాదాస్పద భూసేకరణ బిల్లుపై మాట్లాడుతూ, రైతుల అంగీకారం లేకుండా వారి భూమిని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఏడాది కిందట రైతుల అంగీకారం తప్పనిసరని చెప్పిన రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్ లాంటి నాయకులు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగిపోతున్నా దేశంలో అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ‘అచ్ఛే దిన్’ వచ్చాయని ఎలా చెబుతారని సింధియా నిలదీశారు.