తత్కాల్ స్పెషల్ రైళ్లు!
రైలు టికెట్లు దొరకడం చాలా కష్టమైపోతోంది. తత్కాల్ టిఎట్లు తీసుకుందామంటే ఐదు నిమిషాల్లోనే అయిపోతున్నాయి. అందులోనూ మళ్లీ ప్రీమియం తత్కాల్ కూడా ఒకటి వచ్చింది. అది కూడా దొరకట్లేదని.. ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని రైల్వే వర్గాలు అన్వేషించాయి. ప్రత్యేకంగా 'తత్కాల్ స్పెషల్' రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. అంటే.. ఆ రైల్లో ఉండే టికెట్లన్నీ కేవలం తత్కాల్ టికెట్లు మాత్రమేనన్నమాట.
ప్రయాణికుల కష్టాలను ఎలా సొమ్ముచేసుకోవాలనే విషయం బాగా తెలిసిన రైల్వేశాఖ.. ఇప్పుడీ కొత్త మంత్రం కనుగొంది. బాగా బిజీగా ఉండే మార్గాల్లో ఈ తత్కాల్ స్పెషల్ రైళ్లను ప్రవేశపెడతారు. ఈ రైళ్లకు టికెట్లు ఆన్లైన్తో పాటు కౌంటర్లలో కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే వీటికి రిజర్వేషన్ సమయాన్ని కూడా కొంత పెంచారు. మామూలు తత్కాల్ అయితే 24 గంటల ముందు మాత్రమే బుక్ చేసుకోవాలి. కానీ తత్కాల్ స్పెషల్ రైళ్లకు 60 రోజుల నుంచి 10 రోజుల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ల బుకింగ్ సాఫ్ట్వేర్ సిద్ధం కాగానే రైళ్లను ప్రవేశపెడతామని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగానే తత్కాల్ రైళ్లలో సెకండ్ క్లాస్కు 10 శాతం, మిగిలిన తరగతులకు 30 శాతం అధికంగా టికెట్ ధరలు ఉంటాయి.