తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా కోలువైన నేత జయలలిత. ఆమె జీవితచరిత్రను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఓ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా అలరించిన రమ్యకృష్ణను అమ్మ మాదిరిగా ఫొటోషాప్ చేసి రూపొందించిన ఈ పోస్టర్ వైరల్‌గా మారిపోయింది.
ఈ పోస్టర్‌ను మెచ్చుకుంటున్న నెటిజన్లు జయలలిత పాత్రకు రమ్యకృష్ణ నూరుశాతం న్యాయం చేస్తుందని కితాబిస్తున్నారు. నరసింహలో నీలాంబరిగా, బాహుబలిలో శివగామిగా శక్తిమంతమైన పాత్రలు పోషించిన రమ్యకృష్ణ అమ్మ పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలరని అంటున్నారు. ఫుల్లీ ఫిల్మీ అనే ఫేస్‌బుక్ పేజీ ఈ పోస్టర్‌ను రూపొందించింది. ‘మదర్’ పేరిట కల్పితంగా రూపొందించిన ఈ పోస్టర్‌లో జయలలితపై సినిమాకు దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజు ఉంటే బాగుంటుందని పేర్కొంది.
సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్‌పై తాజాగా రమ్యకృష్ణ స్పందించింది. ఎవరో కల్పితంగా సృష్టించిన ఈ పోస్టర్‌ను వాట్సాప్‌లో తనకు స్నేహితులు పంపించారని ఆమె తెలిపింది. ఇది కేవలం కల్పితమైన పోస్టర్ అయినప్పటికీ, నిజంగా జయలలిత జీవితకథలో నటించేందుకు తాను ఎంతో ఆసక్తితో ఉన్నానని పేర్కొంది. ‘గతంలో నాకు డ్రీమ్‌రోల్స్ అంటూ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఎవరైనా మీ డ్రీమ్‌రోల్ ఏమిటని అడిగితే.. అది జయలలిత పాత్ర పోషించడమేనని కచ్చితంగా చెప్తాను’ అని అన్నారు. ‘జయలలిత గొప్ప ధైర్యశాలి, మేధావి.. ఆమె చాలామంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. మంచి స్క్రిప్టుతో ప్రముఖ దర్శకుడు ముందుకొస్తే జయ మేడం పాత్రను పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిని గౌరవంగా భావిస్తాను’ అని ఆమె చెప్పారు.