'ఇలాంటి రాబందులను తేలిగ్గా వదలకూడదు'
బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలుశిక్షను మద్రాసు హైకోర్టు నిర్ధారించింది. మరో అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ రెండు రోజుల క్రితం సూచించిన న్యాయమూర్తి జస్టిస్ పి. దేవదాసే ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చారు.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో నాలుగున్నరేళ్ల బాలికపై పాతికేళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ నేరం పశుత్వంతో సమానమని జస్టిస్ దేవదాస్ వ్యాఖ్యానించారు. ఈరోజుల్లో పురుషుల కామానికి మహిళలు, పిల్లలు బలైపోతున్నారని, ఈ నేరానికి కేవలం పశువాంఛ తప్ప కారణం అంటూ ఏమీ లేదని, ఇలాంటి నేరప్రవర్తనకు సానుభూతి ఏమాత్రం అవసరం లేదని ఆయన అన్నారు. ఇలాంటి రాబందులను తేలిగ్గా వదిలిపెట్టకూడదని కూడా వ్యాఖ్యానించారు.
సెంథిల్ కుమార్ అనే దోషికి సెషన్స్ కోర్టు 2010 డిసెంబర్ నెలలో విధించిన పదేళ్ల జైలుశిక్షను నిర్ధారించారు. శిక్ష తీవ్రతను తగ్గించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కూడా జస్టిస్ దేవదాస్ భావించారు. నాలుగేళ్ల పాపకు తప్పుడు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.